ఉల్లి రైతుల కన్నీరు | Onion tears for farmers | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతుల కన్నీరు

Published Mon, Nov 10 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

Onion tears for farmers

  • రైతులను దగా చేస్తున్న కమీషన్ ఏజెంట్లు
  •  వ్యాపారుల మాయాజాలంతో ధర అంతంత మాత్రమే
  •  నష్టాలను మూటగట్టుకుంటున్న ఉల్లి రైతులు
  • కర్నూలు(అగ్రికల్చర్): గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతులు క న్నీరు పెట్టుకుంటున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మామూలుగా అయితే 60 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. అనావృష్టి వల్ల ప్రస్తుతం 25 నుంచి క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీనికితోడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలం వల్ల ధర పెరగకపోగా మరింత తగ్గుతోంది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    అనామత్‌తో నష్టాలు..

    కర్నూలు మార్కెట్‌లో ఉల్లిని వేలంపాట ద్వారా కొనాల్సి ఉంది. అరుుతే వ్యాపారులు అనామత్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వేలంపాట ద్వారా ధర రూ.1000 ఆపైన లభిస్తే అనామత్‌పైన రూ.800 నుంచి రూ.900 ధరకే కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. రైతులు కూడా రోజుల తరబడి మార్కెట్‌లో ఉండలేక ఏదో ఒక ధరకు అమ్ముకుని నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక రైతులు తాడేపల్లి గూడేనికి తరులుతున్నారు.
     
    ధరలో వ్యత్యాసం..

    కర్నూలు మార్కెట్‌కు రోజుకు 50 లారీల ఉల్లి వస్తుంటే, తాడేపల్లి గూడెం మార్కెట్‌కు 60 లారీల ఉల్లి జిల్లా నుంచి వెళుతోంది. అక్కడ క్వింటాఉల్లికి రూ.1800 నుంచి రూ.2000 వరకు అత్యధిక ధర లభిస్తోంది. మధ్యస్తంగా రూ.1400 నుంచి రూ.1500 వరకు లభిస్తోంది. అదేకర్నూలులో అత్యధిక ధర రూ.1125 ఉండగా, మధ్యస్తంగా రూ.600 నుంచి రూ.800 వరకు పోతోంది.
     
    అదనపు చార్జీలతో మోసం

    రైతు 50 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు వేస్తే క్లీనింగ్ పేరుతో రెండు క్వింటాళ్ల ఉల్లిని తీసేస్తున్నారు. పైగా కమీషన్ ఏజెంట్లు క్లీనింగ్ చార్జీలను కూడా రైతులపై వేస్తుండడంతో మరింత నష్టపోతున్నారు. తాడేపల్లి గూడెంలో ఉల్లికి క్లీనింగ్ లేదు. లారీల్లో ఉల్లిని తీసుకుపోతే అక్కడక్కడ నాలుగు ప్యాకెట్లు తీసి కింద పోసి వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రం మొత్తం క్లీన్ చేసిన తర్వాతే కొంటారు. ఇలా చేయడం వల్ల కోత, కుప్ప, క్లీనింగ్ చార్జీలు రైతులపై అదనంగా పడుతున్నాయి.

    అదేవిధంగా లోడింగ్, సంచులకు నింపి కాటాపై పెట్టేందుకు చార్జీలను వ్యాపారి భరించాలి. కమీషన్ ఏజెంట్లు మాత్రం ఇవి కూడా రైతుల నుంచి వసూలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతులు తాము తెచ్చిన సరుకును అమ్ముకున్న తర్వాత కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ జారీ చేసిన తక్ పట్టీలు ఇవ్వాల్సి ఉంది.

    ఇందులో రైతు తెచ్చిన సరుకు, ఎన్ని క్వింటాళ్లు అమ్మారు, ధర ఎంత, కూలీ, హమాలీ చార్జీలన్నీ నమోదు చేసి ఇవ్వాలి. కానీ 50 శాతం కమీషన్ ఏజెంట్లు తక్ పట్టీలు ఇవ్వకుండా కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే కమీషన్ ఏజెంట్లు జీరో వ్యాపారానికి పాల్పడుతూ ఇటు ప్రభుత్వానికి, అటు రైతులను మోసం చేస్తున్నారు. ఇటు వ్యాపారుల మాయాజాలం, అటు కమీషన్ ఏజెంట్ల దగా వల్ల ఉల్లి రైతులు నష్టాలపాలవుతున్నాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement