వైఎస్ జగన్ ఎదుట ఉల్లి రైతుల నిర్వేదం.. 22 టన్నులు విక్రయిస్తే దక్కింది రూ.42 వేలు
సరిగ్గా ఏడాది క్రితం అంతే మొత్తం అమ్మితే ఉల్లి రైతు చేతికి రూ.4.5 లక్షలు
వైఎస్ జగన్ ఎదుట ఉల్లి రైతుల నిర్వేదం
సాక్షి ప్రతినిధి, కడప: సార్...! మీరేమని దిగిపోయారో...! రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. ఈసారి ఉల్లి దిగుబడి బ్రహ్మాండంగా ఉంది. కానీ వచ్చే డబ్బులు పంట కోత ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వీరపునాయునిపల్లె మండలం ఈర్లపల్లెకు చెందిన రైతు బైరెడ్డి ఉత్తమారెడ్డి ఇటీవల తాడేపల్లెగూడెం మార్కెట్‌లో 22 టన్నులు విక్రయించగా రూ.42 వేలు వచ్చాయి. అందులో రూ.36 వేలు రవాణా ఖర్చే అయింది. దారి ఖర్చులకు మిగిలిన మొత్తం అయిపోయింది. చేసేది లేక ఉత్తమారెడ్డి కన్నీళ్లతో ఇల్లు చేరుకున్నాడు. మా అందరి పరిస్థితి ఇలాగే ఉంది.
సరిగ్గా ఏడాది క్రితం అదే 22 టన్నులు విక్రయిస్తే ఉల్లి రైతుకు రూ.4.5 లక్షలు లభించేవి. ఇప్పుడు ఇటు మాకు, అటు వినియోగదారులకు కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నా జోక్యం చేసుకుని ఆదుకోవాలన్న స్పృహ కూటమి సర్కారులో కానరావడం లేదు... అంటూ బుధవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వీరపునాయునిపల్లె మండలానికి చెందిన ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
వారి దుస్థితి చూసి చలించిపోయిన వైఎస్ జగన్, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, రైతులను ఆదుకోవాలన్న స్పృహ అంతకంటే లేదని మండిపడ్డారు. మన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నామని, అవస్థలు ఎదుర్కొన్న టమోటా రైతులకు కూడా భరోసా కల్పించామని గుర్తు చేశారు. ధైర్యంగా ఉండాలని, మళ్లీ మంచి రోజులు రానున్నాయని రైతులను ఊరడించారు.
పట్టించుకునేవారు లేరు
ఉల్లి రైతుల గోడు పట్టించుకునేవారే లేరు. ఒకపక్క ధరలు లేవు. మరోపక్క నిల్వ చేసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా పరిషత్ మీటింగ్‌లో అభ్యర్థించినా ఎలాంటి స్పందన లేదు. రైతులకు లారీ బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. – కె రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ
రైతులు కుంగిపోతున్నారు
నాలుగు నెలల పాటు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. దళారీ వ్యవస్థ మార్కెట్‌ను శాసిస్తోంది. క్వింటా రూ.వెయ్యికి మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. దళారీల చర్యలతో రైతులు కుంగిపోతున్నారు. ప్రభుత్వమే ఉల్లిగడ్డలు సేకరించి వినియోగదారుడికి సరఫరా చేయాలి. రైతులను తక్షణమే ఆదుకోవాలి. – ప్రతాప్‌రెడ్డి, మిట్లపల్లె
పెట్టుబడి రాయితీ ప్రకటించాలి
ఇటీవల వర్షాల వల్ల ఉల్లిగడ్డలకు కుళ్లు సోకుతుందని రైతులంతా పంట నూర్పిడి చేశారు. మార్కెట్‌లో ధరలు దారుణంగా తగ్గిపోయాయి. నెల క్రితం వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం అమాంతం పడిపోయాయి. పెట్టుబడులు అటుంచితే నూర్పిడి ఖర్చులు కూడా రాలేదు. రైతుల శ్రమ వృధాగా మారింది. ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ప్రకటించి ఆదుకోవాలి. – వీరయ్య, ఓబుళరెడ్డిపల్లె
Comments
Please login to add a commentAdd a comment