కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా రామోజీరావుకు కనబడటంలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విషం చిమ్ముతూ.. చంద్రబాబును ఆహా, ఓహో అని పొగిడేస్తూ ‘ఉల్లిరైతుకు వెన్నుపోటు’ అంటూ అసత్యాలతో నిండిన కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు హయాంలో తాము పడిన ఇబ్బందులు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమకు ఇస్తున్న ప్రోత్సాహం ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే వెల్లడిస్తున్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క పైసా ప్రీమియం చెల్లించనక్కర్లేకుండానే బీమా మొత్తం తమకు అందిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటతో తాము నష్టపోలేదని స్పష్టం చేస్తున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి 3.10 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయించడం ఒట్టి అబద్ధమని ఈనాడు రాతలను కొట్టిపారేస్తున్నారు. ఇక వర్షాభావం వల్ల పంట సాగు ఆలస్యమైతే.. రైతులే సాగును మానేస్తున్నారని రాయడాన్ని వారు తప్పు పట్టారు.
రూ. 118.05 కోట్ల బీమా చెల్లింపు
టీడీపీ హయాంలో బీమా కోసం 5 శాతం ప్రీమియం చెల్లించి, ఉల్లి సాగు చేసినట్లు మండల వ్యవసాయాధికారి నుంచి సాగు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి వచ్చేది. అయినా ఉల్లి రైతులకు టీడీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రెండేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే ఈ–క్రాప్‌లో నమోదును ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉల్లి పంటకు రూ.118.05 కోట్ల బీమా రైతులకు అందింది. మొదటి సారి బీమా పొందామని ఉల్లి రైతులు సంతోషంగా చెబుతున్నారు.
ఏటికేడు పెరుగుతున్న సాగు..
♦ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019–20 నుంచి 2023–24 వరకు పరిశీలిస్తే ఉల్లి సాగు ఏటికేడు పెరుగుతూనే ఉంది. 2019–20లో 75,525, 2020–21లో 73,708, 2021–22లో 80,719, 2022–23లో 87,453 ఎకరాల్లో ఉల్లి సాగు కావడం విశేషం. దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 41,382 ఎకరాల్లో ఉల్లి సాగు అయింది. వర్షాలు పడుతుండటంతో సాగు ముమ్మరమైంది.
♦ గత మూడేళ్లుగా రైతులు లాభాలనే ఆర్జించారు. 2022–23లో రెండు, మూడు నెలలు మినహా అన్ని నెలల్లో మద్దతు ధర రూ. 770 కంటే ఎక్కువ ధరలే లభించాయి.
♦ ఉల్లి నిల్వ కోసం గోదాములు నిర్మిస్తున్నారు. రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఎంఐడీహెచ్ కింద 75 శాతం సబ్సిడీతో ఉల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కలెక్షన్ సెంటర్లు మంజూరు చేస్తోంది.
♦ 35 శాతం సబ్సిడీతో సోలార్ డ్రైయర్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 120 పనిచేస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో మరో 3 వేలు ఏర్పాటు కానున్నాయి.
రూ. 30,600 బీమా లభించింది
గతేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఈ–క్రాప్‌లో నమోదు అయింది. ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే బీమా అమలైంది. దిగుబడి తగ్గడం వల్ల ఎకరాకు రూ. 10,200 ప్రకారం 3 ఎకరాలకు రూ. 30,600 బీమా లభించింది. గతంలో బీమా చేసుకోవాలంటే 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. గతంలో ఎపుడూ బీమా లభించలేదు. మొదటిసారిగా బీమా లభించడం పట్ల ఆనందంగా ఉంది. ఇక పంటకు సరాసరి రూ. 900 ప్రకారం ధర లభించింది. బీమా వల్ల నష్టం నుంచి బయటపడ్డాం. – దిన్నె మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కల్లూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment