Eeenadu
-
ఉల్లి రైతుకు మేలు చేస్తున్నా కంటగింపు రాతలేనా?
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా రామోజీరావుకు కనబడటంలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విషం చిమ్ముతూ.. చంద్రబాబును ఆహా, ఓహో అని పొగిడేస్తూ ‘ఉల్లిరైతుకు వెన్నుపోటు’ అంటూ అసత్యాలతో నిండిన కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు హయాంలో తాము పడిన ఇబ్బందులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు ఇస్తున్న ప్రోత్సాహం ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే వెల్లడిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క పైసా ప్రీమియం చెల్లించనక్కర్లేకుండానే బీమా మొత్తం తమకు అందిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటతో తాము నష్టపోలేదని స్పష్టం చేస్తున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి 3.10 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయించడం ఒట్టి అబద్ధమని ఈనాడు రాతలను కొట్టిపారేస్తున్నారు. ఇక వర్షాభావం వల్ల పంట సాగు ఆలస్యమైతే.. రైతులే సాగును మానేస్తున్నారని రాయడాన్ని వారు తప్పు పట్టారు. రూ. 118.05 కోట్ల బీమా చెల్లింపు టీడీపీ హయాంలో బీమా కోసం 5 శాతం ప్రీమియం చెల్లించి, ఉల్లి సాగు చేసినట్లు మండల వ్యవసాయాధికారి నుంచి సాగు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి వచ్చేది. అయినా ఉల్లి రైతులకు టీడీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రెండేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే ఈ–క్రాప్‌లో నమోదును ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉల్లి పంటకు రూ.118.05 కోట్ల బీమా రైతులకు అందింది. మొదటి సారి బీమా పొందామని ఉల్లి రైతులు సంతోషంగా చెబుతున్నారు. ఏటికేడు పెరుగుతున్న సాగు.. ♦ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019–20 నుంచి 2023–24 వరకు పరిశీలిస్తే ఉల్లి సాగు ఏటికేడు పెరుగుతూనే ఉంది. 2019–20లో 75,525, 2020–21లో 73,708, 2021–22లో 80,719, 2022–23లో 87,453 ఎకరాల్లో ఉల్లి సాగు కావడం విశేషం. దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 41,382 ఎకరాల్లో ఉల్లి సాగు అయింది. వర్షాలు పడుతుండటంతో సాగు ముమ్మరమైంది. ♦ గత మూడేళ్లుగా రైతులు లాభాలనే ఆర్జించారు. 2022–23లో రెండు, మూడు నెలలు మినహా అన్ని నెలల్లో మద్దతు ధర రూ. 770 కంటే ఎక్కువ ధరలే లభించాయి. ♦ ఉల్లి నిల్వ కోసం గోదాములు నిర్మిస్తున్నారు. రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఎంఐడీహెచ్ కింద 75 శాతం సబ్సిడీతో ఉల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కలెక్షన్ సెంటర్లు మంజూరు చేస్తోంది. ♦ 35 శాతం సబ్సిడీతో సోలార్ డ్రైయర్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 120 పనిచేస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో మరో 3 వేలు ఏర్పాటు కానున్నాయి. రూ. 30,600 బీమా లభించింది గతేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఈ–క్రాప్‌లో నమోదు అయింది. ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే బీమా అమలైంది. దిగుబడి తగ్గడం వల్ల ఎకరాకు రూ. 10,200 ప్రకారం 3 ఎకరాలకు రూ. 30,600 బీమా లభించింది. గతంలో బీమా చేసుకోవాలంటే 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. గతంలో ఎపుడూ బీమా లభించలేదు. మొదటిసారిగా బీమా లభించడం పట్ల ఆనందంగా ఉంది. ఇక పంటకు సరాసరి రూ. 900 ప్రకారం ధర లభించింది. బీమా వల్ల నష్టం నుంచి బయటపడ్డాం. – దిన్నె మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కల్లూరు మండలం -
కేసీఆర్‌తో ఈనాడు ఎండీ కిరణ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ‘ఈనాడు’ ఎండీ సీహెచ్ కిరణ్ మంగళవారం భేటీ అయ్యారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. ఈనాడు గ్రూపు సంస్థల ఆధ్వర్యంలోని రామోజీ ఫిలింసిటీని లక్షనాగళ్లతో దున్నిస్తానని టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ వ్యతిరేక వార్తలపై కేసీఆర్ చాలాసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్ల ఈనాడు సంస్థలకు, కేసీఆర్‌కు మధ్య పెద్దగా సఖ్యత లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో కేసీఆర్‌ను ఈనాడు ఎండీ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. రామోజీ ఫిలింసిటీలో పేదలకు చెందిన అసైన్డ్ భూములున్నాయని, అవన్నీ దురాక్రమణలేనని ఆరోపిస్తూ, లక్షనాగళ్లతో దున్నిస్తానని చేసిన హెచ్చరిక, భూముల విషయంలో తెగని వివాదాలు, మార్గదర్శి సంస్థలపై కేసులు వంటి వాటి నేపథ్యంలో కేసీఆర్‌ను కిరణ్ కలవడంపై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
మోడీని జగన్ కలిస్తే తప్పా?
టీడీపీ, ఈనాడుపై కోటంరెడ్డి ధ్వజం హైదరాబాద్: కాబోయే ప్రధాని మోడీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కలుసుకోవడంలో తప్పేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే కొన్ని పత్రికలు విమర్శలు చేయడం చూస్తే వారు జగన్ అంటే ఎంత భయాందోళనలతో ఉన్నారో తెలిసిపోతోందన్నారు. మంగళవారమిక్కడ శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టబోతున్న మోడీని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక బలమైన ప్రతిపక్ష నేతగా జగన్ కలుసుకున్నారని చెప్పారు. టీడీపీకి కొమ్ము కాసే ఈనాడు దినపత్రిక.. మోడీని జగన్ కలవడమే తప్పన్నట్లుగా తప్పుడు కథనాన్ని రాసిందని విమర్శించారు. ‘‘మోడీ, జగన్ ఏకాంతంగా మాట్లాడుకుంటే.. తన కేసుల గురించి మాట్లాడుకున్నట్లు ఆ పత్రిక రాసింది. లోపల ఉన్నది మోడీ, జగన్ మాత్రమే. అక్కడ మూడో వ్యక్తి లేరు. అలాంటప్పుడు ఈనాడు ప్రతినిధి తాను అక్కడే ఉన్నట్టుగా వార్త ఎలా రాశారు? మోడీ ఏమైనా ఈనాడు యాజమాన్యానికి ఫోన్ చేసి జగన్ తన కేసుల గురించి మాట్లాడినట్టు చెప్పారా’’ అని కోటంరెడ్డి ప్రశ్నించారు. -
‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే.
రామోజీ చురుకుదనాన్ని గమనించిన జీజేఆర్ ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యం కల్పించారని అప్పటి సహోద్యోగులు వివరించారు. ఈ క్రమంలోనే రామోజీని ముందు పెట్టి మార్గదర్శికి జీజేఆర్ శ్రీకారం చుట్టారని, తర్వాత 1963లోనే రామోజీతో ‘ఎలైట్’ అనే సాయంకాలం దినపత్రిక (ఇంగ్లిష్) కూడా పెట్టించారని చెబుతారు. అప్పటికే మార్గదర్శిలోనూ, ఆ తర్వాత రామోజీ పెట్టిన డాల్ఫిన్ హోటళ్లలోనూ జీజేఆర్ పెట్టుబడులే ప్రధానంగా ఉన్నాయి. అనంతర కాలంలో ఈనాడు’ పత్రిక పుట్టుకొచ్చింది కూడా జీజేఆర్ ఆలోచనల్లో నుంచేనని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 1974లో రామోజీ ‘ఈనాడు’ పెట్టేనాటికి ఢిల్లీలో జీజేఆర్ పలుకుబడి పతాక స్థాయిలో ఉంది. ఆ పత్రికకు ఆయనే ఆర్థిక సాయం చేశారని జీజేఆర్ సన్నిహితులు వివరించారు. ‘‘ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్ కూడా జీజేఆర్ చలవే. కమ్యూనిస్టు కార్డును పూర్తిస్థాయిలో ఉపయోగించి తూర్పు జర్మనీ నుంచి సెకండ్ హ్యాండ్ ముద్రణా సామగ్రి మొత్తాన్నీ ఈనాడుకు సాధించి పెట్టారు జీజేఆర్. ఆ రుణాన్ని ఏడేళ్ల పాటు సులభ వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు కూడా చేయించారు. ఇలా తొలినాళ్లలో రామోజీ పెట్టిన సంస్థల పునాదులన్నీ పూర్తిగా జీజేఆర్ వేసినవే’’ అని వివరించారు. అంతేకాదు, ‘‘రామోజీ ఒకట్రెండుసార్లు నా సమక్షంలోనే జీజేఆర్ దగ్గరికి డబ్బుల కోసం వచ్చి వెళ్లాడు. అది రామోజీకి నిత్యకృత్యమేనని ఆ తర్వాత జీజేఆర్ నాతో చెప్పారు’’ అని జీజేఆర్‌కు అతి సన్నిహితుడైన ఓ ప్రముఖ వ్యక్తి కూడా సాక్షి ప్రతినిధికి వివరించారు. -
ఈనాడులో వచ్చేవి చెల్లింపు వార్తలు: వైఎస్సార్సీపీ
* టీడీపీ-ఈనాడు కుమ్మక్కుకు నిదర్శనమిదే * చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలను ‘ఈనాడు’ తన ఎన్నికల ప్రత్యేకం ‘పాంచజన్యం’లో ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈనాడు ఎన్నికల ప్రత్యేకం ప్రారంభించినప్పటి నుంచీ తొలి పేజీలో జగన్మోహన్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలపై తప్పుడు వార్తలు ప్రచురిస్తోందని, కోర్టు విచారణలో ఉన్న కేసులపై తప్పుడు కథనాలను ప్రచురించడం ‘సబ్‌జ్యుడీస్’ అవుతుందని తెలిసినా ఈ పని చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు మంగళవారం ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఎన్నికల సీజన్లో టీడీపీ, ఈనాడు కలసి తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మరో రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక రాజకీయపార్టీతో కలవడమనేది అభ్యంతరకరమని, తన పాఠకులను ప్రభావితం చేసి టీడీపీకి వారి సానుభూతిని సాధించి పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమని తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. టీడీపీతో ఈనాడు కుమ్మక్కు అయిందనడానికి ఇలాంటి వార్తల ప్రచురణే నిదర్శనమన్నారు. ఈ వార్తలను టీడీపీ డబ్బు చెల్లించి ఈనాడులో రాయించుకుంటున్న వార్తలుగా పరిగణించాలని, వీటిపై విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.