కేసీఆర్‌తో ఈనాడు ఎండీ కిరణ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ‘ఈనాడు’ ఎండీ సీహెచ్ కిరణ్ మంగళవారం భేటీ అయ్యారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. ఈనాడు గ్రూపు సంస్థల ఆధ్వర్యంలోని రామోజీ ఫిలింసిటీని లక్షనాగళ్లతో దున్నిస్తానని టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ వ్యతిరేక వార్తలపై కేసీఆర్ చాలాసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ కారణాల వల్ల ఈనాడు సంస్థలకు, కేసీఆర్‌కు మధ్య పెద్దగా సఖ్యత లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో కేసీఆర్‌ను ఈనాడు ఎండీ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. రామోజీ ఫిలింసిటీలో పేదలకు చెందిన అసైన్‌డ్ భూములున్నాయని, అవన్నీ దురాక్రమణలేనని ఆరోపిస్తూ, లక్షనాగళ్లతో దున్నిస్తానని చేసిన హెచ్చరిక, భూముల విషయంలో తెగని వివాదాలు, మార్గదర్శి సంస్థలపై కేసులు వంటి వాటి నేపథ్యంలో కేసీఆర్‌ను కిరణ్ కలవడంపై పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.