కాబోయే ప్రధాని మోడీని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కలుసుకోవడంలో తప్పేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే కొన్ని పత్రికలు విమర్శలు చేయడం చూస్తే వారు జగన్ అంటే ఎంత భయాందోళనలతో ఉన్నారో తెలిసిపోతోందన్నారు.
టీడీపీ, ఈనాడుపై కోటంరెడ్డి ధ్వజం
హైదరాబాద్: కాబోయే ప్రధాని మోడీని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కలుసుకోవడంలో తప్పేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే కొన్ని పత్రికలు విమర్శలు చేయడం చూస్తే వారు జగన్ అంటే ఎంత భయాందోళనలతో ఉన్నారో తెలిసిపోతోందన్నారు. మంగళవారమిక్కడ శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టబోతున్న మోడీని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక బలమైన ప్రతిపక్ష నేతగా జగన్ కలుసుకున్నారని చెప్పారు. టీడీపీకి కొమ్ము కాసే ఈనాడు దినపత్రిక.. మోడీని జగన్ కలవడమే తప్పన్నట్లుగా తప్పుడు కథనాన్ని రాసిందని విమర్శించారు.
‘‘మోడీ, జగన్ ఏకాంతంగా మాట్లాడుకుంటే.. తన కేసుల గురించి మాట్లాడుకున్నట్లు ఆ పత్రిక రాసింది. లోపల ఉన్నది మోడీ, జగన్ మాత్రమే. అక్కడ మూడో వ్యక్తి లేరు. అలాంటప్పుడు ఈనాడు ప్రతినిధి తాను అక్కడే ఉన్నట్టుగా వార్త ఎలా రాశారు? మోడీ ఏమైనా ఈనాడు యాజమాన్యానికి ఫోన్ చేసి జగన్ తన కేసుల గురించి మాట్లాడినట్టు చెప్పారా’’ అని కోటంరెడ్డి ప్రశ్నించారు.