సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని లోటు బడ్జెట్ పరిస్థితి తెచ్చారని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్తవ్యదీక్షతో సడలని విశ్వాసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని, ప్రజలంతా కలకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విలువలూ విశ్వసనీయత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు.
చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం చూస్తుంటే ఉగ్రవాదులు శాంతి వచనాలు వల్లించినట్లే ఉందని అన్నారు. చంద్రబాబును గతంలో నాదెండ్ల భాస్కర్‌రావు జేబు దొంగ అని విమర్శించారని, ఎన్టీఆర్ అయితే ఆయనను జామాత దశమగ్రహం అంటూ మండిపడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు జీవితమంతా వంచనేనని, ఆయన అప్పట్లో నరకారుసుడు, ఇప్పట్లో నారాసుడిగా మారిపోయారని విమర్శించారు. చంద్రబాబుకు చదువుకుంటున్నప్పటి నుంచీ కుల పిచ్చి ఉందని అన్నారు.
లోకేశ్ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు!
లోకేశ్ దీక్షలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్‌కు తెలియదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్‌సీపీ 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చంద్రబాబు-లోకేశ్‌లను విమర్శించారు.
మీడియాపై తమకు ఎప్పుడూ గౌరవం ఉందని, జీవో 2430 ఎప్పటినుంచో ఉంది.. కొత్తగా పెట్టింది ఏమీకాదని శ్రీధర్‌రెడ్డి వివరించారు. కొన్ని పత్రికలు, ఛానెల్స్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని అన్నారు. సాక్షి మీడియాను గత ప్రభుత్వంలో చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు. ఇసుకాసురుల్లా గతంలో టీడీపీ నేతలు గ్రామల్లో ఇసుకను దోచుకున్నారని, కానీ ప్రస్తుతం సీఎం ఇసుక విషయంలో అధికారుకులకు స్వేచ్ఛ నిచ్చారని తెలిపారు. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇసుకకు మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment