జలీల్‌ఖాన్, వెల్లంపల్లి శ్రీనివాస్ (జతచేసిన చిత్రం)
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విజయవాడలో వచ్చిన ప్రజలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మద్యం తాగి రోడ్లపైకి వచ్చి పోలీసులు, వైఎస్పార్‌సీపీ నాయకులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని నాని, బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు వీళ్ళందరికి అండగా ఉండి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌కు విశ్వాసం లేదని విమర్శించారు. ‘జలీల్‌ఖాన్.. నీకు విశ్వాసం ఉంటే పార్టీ మారేవాడివి కాదు. నీకు సిగ్గుంటే వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. టీడీపీ నుంచి నువ్వు.. వైఎస్సార్‌సీపీ తరుపున నేను ఎన్నికల్లో పోటీ చేద్దాం. నీకు డిపాజిట్లు కూడా రావు. ఒకవేళ జలీల్‌ఖాన్‌కు డిపాజిట్లు వస్తే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. వైఎస్సార్‌సీపీ నాయకులు చటర్జీ, దుర్గాలను జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారు. వాళ్ళకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించాలి. టీడీపీ నాయకులు చేసే రౌడీయిజానికి వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ భయపడదు. జలీల్‌ఖాన్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరకోం. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు స్పందించటం లేదు. ఎమ్మెల్యే చింతమనేని ఆర్టీసీ కండక్టర్‌ను కొడితే ఉద్యోగ సంఘాలు ఏమయ్యాయ’ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment