
విజయవాడ సీటీ: టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని... తెలుగు ప్రజలను మోసం చేసే మాయనాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్ అభివర్ణించారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్ల అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబుకు కేంద్రం అంటే భయం పట్టుకుందన్నారు. చివరకు తిరుమల దేవస్థానంలో స్వామి వారి నగలను కూడా వదలిపెట్టని చంద్రబాబుకు చిప్పకూడు తప్పదని హెచ్చరించారు.
టీడీపీ అధినేతగా చంద్రబాబు మహానాడులో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారని, కానీ మహానాడులో తయారు చేస్తున్న కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకులు తదితర వంటల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ విధానాల గురించి కాకుండా వైఎస్ జగన్‌పై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ధైర్యంగా అవిశ్వాసం పెట్టిన దేశంలోనే మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబుపై సీబీఐ, ఏసీబీ, ఈడీలు విచారణ చేపడతాయని, ఆయనకు చిప్పకూడు తధ్యమన్నారు. పంచాయతీ సర్పంచ్ అనుభవం కూడా వైఎస్ జగన్‌కు లేదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఎంపీగా అత్యధిక మెజారిటీ సాధించిన రెండో వ్యక్తి అని అన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఆ నిందను కేంద్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయిందని చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్సార్ మాత్రమే అన్నారు. ఆరోగ్యశ్రీని అద్భుతంగా కొనసాగించారన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానైనా చంద్రబాబు అబద్ధాలు మానేయాల’ని వెల్లంపల్లి హితవు పలికారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, అయితే నీలా పొత్తులతో కాకుండా సింగిల్‌గానే సింహంలా ఎన్నికలకు వెళ్తామని వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment