
సాక్షి, విజయవాడ: గత ఐదు ఏళ్లలో అభివృద్ధి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ దోపిడికి మాత్రమే పరిమితమయ్యారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల కన్న రాయలసీమలో కీయా వంటి 30 పరిశ్రమలు వస్తే చాలు అంటున్న.. బాబు, లోకేష్ ఐదేళ్లపాటు గాడిదలు కాశారా అని తీవ్రంగా మండిపడ్డారు. బాబు తన పాలనలో రాయలసీమకు 30 పరిశ్రలు ఎందుకు తేలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుండగా చంద్రబాబు అడ్డుపడుతున్నారని వెల్లంపల్లి దుయ్యబట్టారు.
చంద్రబాబు వంటివారు ఎందరు అడ్డువచ్చినా సీఎం జగన్ చేసే అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లంపల్లి అన్నారు. లోకేష్ నాయుడు మంగళగిరిలో ఓడిపోయాడు. రానున్న రోజుల్లో చంద్రబాబు కుప్పంలో సైతం ఓడిపోతారని వెల్లపల్లి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతతో అసెంబ్లీలో సైతం అడుగు పెట్టలేని స్థితికి చంద్రబాబు చేరతారని ఆయన ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు మాట పవన్ కల్యాణ్ నోట.. అదే మాట కన్నా లక్ష్మినారాయణ నోట’ అన్న చందంగా పరిస్థితులు మారాయని ఆయన విమర్శించారు.( గత పాలనలో పశ్చిమ అభివృద్ధికి నోచుకోలేదు)
ముగ్గురు రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని వెల్లంపల్లి మండిపడ్డారు. పాచిపోయిన లడ్డులు అని.. మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం అన్న పవన్ కల్యాణ్ మోదీ చెంత చేరారని వెల్లంపల్లి దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కన్నా లక్ష్మినారాయణ, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పరాజితులుగా వారు మిగిలిపోతారని వెల్లంపల్లి తెలిపారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకుడదని అన్ని జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అమ్మఒడి పధకం ద్వారా వైఎస్సార్‌సీపీ నాయకులు విద్యార్థుల వద్ద వెయ్యి రూపాయలు దండుకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను వెల్లంపల్లి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన పాలనలో పిల్లలు చదవాలని ఎన్నడు ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే.. చంద్రబాబు మాత్రం 30 శాతమే ఇస్తామని.. 60 శాతం విద్యార్థులను కట్టుకోవాలన్నారని ఆయన తెలిపారు. ఒకటవ తరగతి నుంచే సీఎం జగన్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కృషి చేస్తున్నారని అయన గుర్తు చేశారు. అమ్మఒడి, మనబడి నాడు - నేడు, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన వంటి పధకాలతో విద్యకు పెద్దపీట వేస్తున్నారని వెల్లంపల్లి తెలిపారు. పేరెంట్స్ కమిటీల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు లేరని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బడి బాగు కోసం తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment