
సాక్షి, అమరావతి: నారా లోకేశ్‌కి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం దొరకలేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను పరామర్శించేందుకు మాత్రం వెళ్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈ కోవలోనే ట్యాక్సులు కట్టకుండా అడ్డదారుల్లో బస్సులను తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని, పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెలంపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
► ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతోనే లోకేశ్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
► లోకేశ్ సంతకాలు చేసిన లేఖలన్నింటినీ పరిశీలిస్తాం. ఆయన చేసిన అవినీతి మీద కూడా విచారణ జరుగుతోంది.
► ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న నిజమైన బాహుబలి.. సీఎం వైఎస్ జగన్.
► అచ్చెన్నాయుడు, లోకేశ్ తదితరులు కాలకేయులు. లోకేశ్‌ను కూడా టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
► వెఎస్ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు ఉందా? టీడీపీ హయాంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చేయలేదా?
► మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. ఆయనకు ప్రభుత్వం వల్ల ఎలాంటి ప్రాణహాని లేదు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. పింగళి దశరథరామ్‌ను నడిరోడ్డుపై చంపించింది ఎవరు? వంగవీటి రంగాను హత్య చేయించింది టీడీపీ కాదా? హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే.