విలేకరులతో మాట్లాడుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: టీడీపీ నిర్వహిస్తోంది మహానాడు కాదు, తెలుగు ప్రజలను మోసం చేసే మాయనాడు అని విజయవాడ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ద్వారా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారు కానీ మహానాడులో తయారు చేస్తున్న వంటల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ విధానాల గురించి కాకుండా వైఎస్ జగన్‌పై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని తెలిపారు. ధైర్యంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు.
‘నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబుకు కేంద్రం అంటే భయం. ఓటుకు నోట్లు కేసులో ఏమవుతుందోనని భయం. మీలాగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వైఎస్ జగన్‌కు చేతకాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు అరెస్ట్ చేస్తాయోనని భయం. చంద్రబాబుకు అరెస్ట్ కావడం, చిప్పకూడు తినడం ఖాయం. చంద్రబాబు తనయుడు లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యారు. లోకేష్ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం వుందా? రాష్ట్ర ప్రజలను మోసగించడం మీకే చెల్లుతుంది. ప్యాకేజీ కావాలన్నావు, హోదా సంజీవని కాదన్నావు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నావు. కర్ణాటక గురించి మాట్లాడే చంద్రబాబు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేలను ఎలా కొన్నావు? అడ్డగోలుగా ప్రజలను దోచుకుని, సింగపూర్, మలేషియాలో దాచుకున్నావు. నమ్మి ఓటు వేసిన తెలుగు ప్రజలను నట్టేటముంచారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను వైఎస్ఆర్ తెచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానైనా చంద్రబాబు అబద్దాలు మానేయాల’ని వెల్లంపల్లి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment