ఉల్లి,పత్తి రైతులకు సముచిత పరిహారం | Resolution In ZP Meeting Of YSR District Compensation For Farmers | Sakshi
Sakshi News home page

ఉల్లి,పత్తి రైతులకు సముచిత పరిహారం

Published Sat, Oct 22 2022 12:13 PM | Last Updated on Sat, Oct 22 2022 12:50 PM

Resolution In ZP Meeting Of YSR District Compensation For Farmers - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో ఉల్లి, పత్తి పంటలు కోల్పొయిన రైతులకు సముచిత పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఎన్యుమరేషన్‌ నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. వేసవిలో గ్రామాలకు తాగునీరు రవాణా చేసినందుకు రూ. 7.57 కోట్ల నిధులు విడుదల చేయాలనితీర్మానించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంపై జెడ్పీ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు.

ప్రతి సచివాలయాన్ని మొబైల్‌ యూనిట్లు నెలలో రెండుసార్లు సందర్శిస్తాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జగనన్న ఇళ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ రహదారుల ఏర్పాటు, మరమ్మతులపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా పరిధిలోని సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, అలా కాని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.

సీఎం సొంత జిల్లా గనుక అందరి దృష్టి ఇక్కడే ఉంటుందన్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు.  వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో వీఎన్‌ పల్లె ఎంపీపీ రఘునాథ్‌ మాట్లాడుతూ తమ మండలంలో రైతులు ఉల్లిసాగు చేయగా, భారీ వర్షాలకు మొలకలు వచ్చాయన్నారు. చెన్నైకి తీసుకెళ్లి విక్రయిద్దామనుకుంటే క్వింటా కేవలం రూ. 400లకే అడుగుతున్నారని పేర్కొన్నారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలోని నాలుగు పంచాయతీల్లో ఉల్లికి భారీ నష్టం వాటిల్లిందన్నారు.  

∙జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా మాట్లాడుతూ ఎరువుల కొరత తీవ్రంగా ఉందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు మినీ కిట్స్‌ పంపిణీ చేయాలని కోరారు.  

∙చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలో కొన్ని గ్రామాల్లో డీకేటీ పట్టాలు ఆన్‌లైన్‌లో నమోదు కానందున రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారని చెప్పారు.  

∙తాళ్లపల్లి పీహెచ్‌సీ నుంచి వైద్యులను డిప్యుటేషన్‌పై పంపవద్దని వేంపల్లె జెడ్పీటీసీ కోరారు. వేంపల్లెలో 60 వేల జనాభా ఉన్నప్పటికీ గైనకాలజిస్టు లేరన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ తమ మండలంలో గైనకాలజిస్టులను నియమించడంతోపాటు బద్వేలులో డయాబెటిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గాలివీడు ఎంపీపీ మాట్లాడుతూ హెడ్‌ క్వార్టర్‌లో మరో వైద్యుడిని నియమించాలన్నారు.  

మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు:కలెక్టర్‌ విజయరామరాజు 
వైఎస్సార్‌  కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.జేసీ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పీహెచ్‌సీలలో గైనకాలజిస్టుల కొరత ఉన్న మాట నిజమేనన్నారు. ఎవరైనా వైద్యులు ముందుకు వస్తే వెంటనే అపాయ్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇస్తామన్నారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు.  కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సగంలో ఆగిపోయిన అంగన్వాడీ భవనాలను నాడు–నేడు కార్యక్రమంలో చేర్చాలని సూచించారు. వీఎన్‌ పల్లెను పాడా కిందికి చేర్చాలని మండల సమావేశంలో తీర్మానించామని, జెడ్పీలో కూడా ఆ మేరకు తీర్మానం ఆమోదించాలని కోరారు. యంత్రాల సాయంతో చెరువుల్లో మట్టి తవ్వి పొలాలకు తీసుకు వెళ్లేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలన్నారు.  

∙బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ అంగన్వాడీ కేంద్రంలో వంట గ్యాస్‌ లేనందువల్ల కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారని తెలిపారు.  

∙జెడ్పీటీసీ గోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డిలు మాట్లాడుతూ తమ మండలంలోని 40 గ్రామాలకు సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక్క గ్రామానికి తాగునీరు ఇస్తున్నట్లు అధికారులు నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. 

∙మొయిళ్ల కాల్వ–రంపతాడు కల్వర్టు ఏర్పాటు చేయాలని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య కోరారు.  
∙తాగునీటి రవాణా బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి ఆదుకోవాలని గాలివీడు ఎంపీపీ కోరారు. వారం, పది రోజుల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. ∙హైవేలో ఇళ్లు కోల్పొయిన వారికి స్థలాలు ఇవ్వాలని, సచివాలయాలకు విద్యుత్‌ సమస్య తీర్చాలని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్‌యాదవ్‌ కోరారు. 
∙తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు 150 ఎకరాల భూములను ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపి భూములను స్వాధీనం చేసుకోవాలని పుల్లంపేట జెడ్పీటీసీ కోరారు. ఆ భూములను అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని కోరారు. 

భూ ఆక్రమణపై ఆర్డీఓతో విచారణ: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా 
కలెక్టర్‌ గిరీషా స్పందిస్తూ  ప్రభుత్వ భూమి దురాక్రమణపై ఆర్డీఓతో విచారణ చేయిస్తామని తెలిపారు. కబ్జాదారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తామన్నారు. భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని హామి ఇచ్చారు. సోలార్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పొయిన వారికి పరిహారం ఇవ్వాలని, ఇందులో చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి గాలివీడు ఎంపీపీ కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, రమేష్‌ యాదవ్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్‌ చైర్మన్‌ గానుగపెంట రమణమ్మ, జెడ్పీ సీఈఓ ఎం.సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. 

104 వాహనాలు  హెడ్‌ క్వార్టర్స్‌లో ఉంచాలి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
వైద్య, ఆరోగ్యంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 104 వాహనాలు సచివాలయాల హెడ్‌ క్వార్టర్స్‌లో ఉంచాలని కోరారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్‌రే ప్లాంటు వంటి వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

చాలా పీహెచ్‌సీల్లో గైనకాలజిస్టులు, ఇతర స్పెషలిస్టుల కొరత వేధిస్తోందని, వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంపై సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సిబ్బంది తరుచూ పీహెచ్‌సీలను సందర్శించి అక్కడ అమలవుతున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ సేవలను పరిశీలించాలన్నారు. 24 గంటలు గ్రామీణ హెల్త్‌ క్లినిక్స్‌ ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. హెల్త్‌ క్లినిక్స్‌లలో ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశాలను అందుబాటులో ఉంచాలని కోరారు.  

సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు: ఇన్‌చార్జి మంత్రి 
ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ జిల్లాలో 16 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల చాలామంది రైతులు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు. కనుక ఎన్యుమరేషన్‌ నిర్వహించి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన ఉల్లి, పత్తి పంటలను ఎన్యుమరేషన్‌ చేయించి రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాలని సూచించారు. ఆయన సూచనకు జెడ్పీ చైర్మన్‌ అంగీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement