రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు | Farmers account 'waiver' pinhole | Sakshi
Sakshi News home page

రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు

Published Thu, Dec 4 2014 3:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు - Sakshi

రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు

  • గిట్టుబాటు లేకున్నా బయట మార్కెట్‌లో విక్రయించేందుకు మొగ్గుతున్న రైతన్న
  •  ధాన్యం విక్రయాలు, రైతుల సమస్యలపై పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్య వైఖరి
  •  ధాన్యం అమ్మిన డబ్బులు బ్యాంకుల కైవసం
  • సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణ మాఫీ అంశంపై నాన్చుడు ధోరణి అన్నదాతలను అనేక కష్టాల పాలుజేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని.. ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించనక్కరలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెప్పటంతో.. రుణాలు చెల్లించకుండా రుణ మాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పుడు అదే శాపంగా పరిణమిస్తోంది.

    ఇప్పటికే బ్యాంకు రుణాలు తీరనందున రైతులు డిఫాల్టర్లుగా మారి కొత్త రుణాలు పొందడానికి అనర్హులయ్యారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగు చేసిన రైతులు.. ఇప్పుడు పండించిన ధాన్యం విక్రయించగా వచ్చిన సొమ్ము బ్యాంకు ఖాతాలకు వస్తుండటంతో.. ఆ డబ్బును కాస్తా బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో చేతికి చిల్లిగవ్వ రాక.. బయట అప్పులు తీర్చటం మాట దేవుడెరుగు కనీసం కుటుంబ పోషణ ఎలా అన్నది అన్నదాతకు జవాబు లేని ప్రశ్నగా మారింది.
     
    గిట్టుబాటు లేకున్నా బయటకే మొగ్గు...

    రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సర్కారు చెప్తుండటంతో.. చాలా మంది రైతులు అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. విక్రయించగా వచ్చిన ధాన్యానికి డబ్బు నగదు రూపంలో ఇవ్వకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మరుక్షణమే.. ఆయా బ్యాంకులు సంబంధిత రైతుల పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి.

    దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కొందరు రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాల్సింది పోయి.. రుణం తీసుకోని బ్యాంకుల్లో కొత్తగా ఖాతా ప్రారంభించాలని ఉచిత సలహా ఇస్తుండటం విశేషం.

    ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు గిట్టుబాటు ధర లభించకపోయినా సరే బయట మార్కెట్లో విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని గిట్టుబాటు ధర ఇవ్వకుండా వ్యాపారులు నిలువునా మోసం చేస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము తప్పని పరిస్థితుల్లో బయట మార్కెట్లో విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.
     
    పౌరసరఫరాల శాఖ నిర్లిప్తత...

    రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 15.17 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంట సాగుచేశారు. తద్వారా 58.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో వెలుగు గ్రూపు సభ్యుల ద్వారా 591 కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 433, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా 45 చొప్పున మొత్తం 1,069 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    అయితే రైతుల ఇబ్బందులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కనీసం ఏ జిల్లాలో ఎంత పంట పండిందో కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది నుంచి సరైన వివరాలు కూడా సేకరించలేదంటే వారి పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.

    ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఎండబెట్టుకునేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయమై చొరవ  తీసుకుని తరచూ సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో అంతిమంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి నెలకొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement