చిరకాల స్వప్నం.. త్వరలోనే సాకారం..  | Rapid Action To Set Up Ramayapatnam Port | Sakshi
Sakshi News home page

పోర్టుకు ముందడుగు

Published Sat, Sep 19 2020 11:13 AM | Last Updated on Sat, Sep 19 2020 11:13 AM

Rapid Action To Set Up Ramayapatnam Port - Sakshi

రామాయపట్నం సముద్ర తీరం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సముద్ర తీరంలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పనులు ప్రారంభించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహా్వనించేందుకు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు జ్యుడీషియల్‌ రివ్యూకు కూడా పంపించింది. తొలిదశలో మూడు బెర్తులతో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజల్లో రెట్టించిన ఆనందం నెలకొంది.   

36 నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు:  
రామాయపట్నం పోర్టు పనులను 36 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ నెలలోనే బిడ్డింగ్‌ విధానాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశలో మూడు బెర్తులతో పనులు ప్రారంభించేలా విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టు వ్యయ అంచనా విలువ రూ.2,169.62 కోట్లుగా నిర్ణయించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. పోర్టు నిర్మాణాల్లో అనుభవమున్న బడా కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. రివర్స్‌ టెండర్‌ ద్వారానే కాంట్రాక్టును కట్టబెట్టేలా ఇప్పటికే నిర్ణయించారు. పోర్టుకు తొలి దశలో మూడు బెర్తులను 900 మీటర్ల పొడవుతో 34.5 మీటర్ల లోతు ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.   

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ... 
రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. వై.ఎస్‌.జగన్‌ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్‌కార్పెట్‌ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం వరంగా మారింది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమి పూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే.  

2012లోనే అనుకూలమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ 
పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ స్టేక్‌ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్‌ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అనువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్‌ 15న కేబినెట్‌ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్‌ సమరి్పంచింది. ఆ నోట్‌ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోం, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు.   

పోర్టు ఏర్పాటుకు అనుకూలాంశాలు ఇవీ.. 
జిల్లాలోని ఉలవపాడు– గుడ్లూరు మండలాల పరిధిలో రామాయపట్నం ఉంది. ఇక్కడ ‘సీఫ్రంట్‌’ సుమారుగా 7.5 కి.మీ తీరం పొడవున అతి దగ్గరలో సుమారు 10 మీటర్ల లోతు ఉండటం పోర్టు నిర్మాణానికి అనుకూలాంశంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మడ అడవులు అడ్డంకిగా లేని సముద్ర తీరం ఇక్కడ అందుబాటులో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. సముద్ర తీరానికి అతి చేరువలో రవాణాకు అనుకూలంగా రైల్వేలైన్, 16వ నంబర్‌ జాతీయ రహదారి ఉండటం వల్ల పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. దీనికితోడు రామాయపట్నం ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్‌ భూములు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములు అధికంగా అందుబాటులో ఉండటంతో స్థల సేకరణలో ఇబ్బందులు లేవు. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో పోర్టు నిర్మాణం జరిగితే పారిశ్రామికవేత్తలకు జల రవాణా కూడా అత్యంత చేరువలో ఉంటుంది. దీని వల్ల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement