రామాయపట్నం పోర్టుకు భూమి పూజ.. సీఎం జగన్‌ పర్యటన వివరాలిలా.. | Bhumi Puja for Ramayapatnam Port by CM YS Jagan | Sakshi
Sakshi News home page

రామాయపట్నం పోర్టుకు భూమి పూజ.. సీఎం జగన్‌ పర్యటన వివరాలిలా..

Published Wed, Jul 20 2022 3:12 AM | Last Updated on Wed, Jul 20 2022 1:45 PM

Bhumi Puja for Ramayapatnam Port by CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు పునాది రాయికే పరిమితం చేసిన రామాయపట్నం ఓడ రేవును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలోసీఎం ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. 

యువతకు భారీగా ఉపాధి లక్ష్యంతో..
గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. 

రెండు దశల్లో 19 బెర్త్‌లతో..
రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు  మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి.  

40,000 మందికి ఉపాధి
రెండో దశలో రూ.6,904 కోట్లు వ్యయం కానుంది. మొదటి దశలో 24.91 మిలియన్‌ టన్నులు, రెండో దశలో 113.63 మిలియన్‌ టన్నుల కార్గోతో కలిపి మొత్తం 138.54 మిలియన్‌ టన్నుల కార్గో సామర్థ్యం అందుబాటులోకి రానుంది. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. 

నేడు సీఎం పర్యటన ఇలా.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు. 11.00 నుంచి 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి 2 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement