ఎర్రచందనం టెండర్‌కు స్పందన కరువు
- 3,500 టన్నుల్లో 1,300 టన్నులకే టెండర్లు
తిరుపతి మంగళం : రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ఎంఎస్‌టీసీ సంస్థ ద్వారా ఎర్రచందనం విక్రయానికి నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరువైంది. మొదటి దశలో 1,400 టన్నుల ఎర్రచందనానికి నిర్వహించిన టెండర్లలో 1100 టన్నులకు టెండర్లు వచ్చాయి. రెండో విడతలో భాగంగా ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు టెండర్లు నిర్వహించారు. రెండో దఫా నిర్వహించే టెండర్లపై గంపెడాశపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేదు పరిస్థితిలు ఎదురయ్యాయి. దుంగల రూపంలో ఎర్రచందనం ఎగుమతికి టెండర్లకు సంబంధించిన సైటీస్, డీజీఎఫ్‌టీ(డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), వాణిజ్యశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో రెండో దఫా టెండర్లకు అటవీశాఖ సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే రేణిగుంట సమీపంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో నిల్వ ఉంచిన 4వేల మెట్రిక్ టన్నుల్లో 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు ఈనెల 17 నుంచి 20వతేదీ వరకు టెండర్లు నిర్వహించారు. 3500 మెట్రిక్ టన్నులకుగానూ కేవలం 1300 టన్నులకు మాత్రమే టెండర్లు వచ్చాయి. ఎర్రచందనం వేలం ద్వారా రూ.కోట్లాది ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆశించింది. తొలి దశ వేలంలో సుమారు రూ.800 కోట్లు వరకు ఆదాయం సాధించాలని భావించినా సరైన ప్రచారం లేకపోవడంతో అది సాధించలేకపోయ్యారు. అయితే రెండో దఫా టెండర్ల ద్వారా విక్రయించే ఎర్రచందనం దుంగల్లో ఎక్కువ శాతం ఎ,బి గ్రేడ్ దుంగలే ఉండడంతో ప్రభుత్వ లక్ష్యం కూడ పూర్తవుతుందని అటవీశాఖ భావించింది.
ఎలాగైనా ఎర్రచందనం టెండర్లకు మంచి ఆదరణ లభించేలా విదేశాల్లో సైతం ఒక ప్రత్యేక బృందాలతో ప్రచారం కూడ నిర్వహించారు. అయినా అటు ప్రభుత్వం ఇటు అటవీశాఖ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. మొదటి దఫా నిర్వహించిన టెండర్లలో కొనుగోలు చేసిన గుత్తేదారులు చాలామంది ఇంతవరకు ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లకుండా అలానే వదిలేశారు. రెండుసార్లు నిర్వహించిన టెండర్లలో ఔత్సాహికుల నుంచి స్పందన కరువు అవడంతో ప్రభుత్వం, అటవీశాఖ నిరాశకు గురయ్యాయి. అయితే ముంబయిలోనిడెమైండ్ సంస్థ ప్రతినిధులు గతంలో టెండర్లలో కొనుగోలు చేసిన ఎర్రచందన దుంగలను తీసుకెళ్లేందుకు శనివారం అలిపిరి వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. ఎర్రచందనాన్ని తీసుకెళ్లేందుకు కావాల్సిన అనుమతులన్నీ పొందామని, తమ సరుకు అప్పజెప్పాలని ఫారెస్ట్ రేంజర్ బాలవీరయ్యను కోరారు. అనుమతులను పూర్తిస్తాయిలో పరిశీలించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేస్తామని చెప్పారు.