బెరైటీస్ అమ్మకానికి గ్లోబల్ టెండర్లు
ఏపీఎండీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజ విక్రయాలకు ‘ఈ-టెండర్ కమ్ ఈ-వేలం’ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) నిర్ణయించింది. 6 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్, 2 లక్షల టన్నుల ‘బి’ గ్రేడ్ ఖనిజ విక్రయాలకు ఈ-టెండర్ల నిర్వహణ బాధ్యతలను మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎస్‌టీసీ)కు అప్పగించింది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు మే 4ను తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. విదేశీ సంస్థలైతే 1.50 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్ ఖనిజ కొనుగోలుకు టెండర్లు కోట్ చేయాలి. ‘బి’ గ్రేడ్ ఖనిజానికైతే లక్ష టన్నులకు టెండర్ వేయాలి.
దేశీయ సంస్థలైతే ‘ఎ’ గ్రేడ్ ఖనిజం లక్ష టన్నులు, ‘బి’ గ్రేడ్ ఖనిజం 40 వేల టన్నులకు టెండర్లు వేయవచ్చు.ఆన్‌లైన్ దరఖాస్తుల దాఖలుకు దేశీయ సంస్థలైతే రూ.50 వేలు, విదేశీ సంస్థలైతే 1,500 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. బిడ్ సెక్యూరిటీ కింద ‘ఎ’ గ్రేడ్ ఖనిజ టెండర్లకు భారతీయ సంస్థలు/వ్యక్తులు రూ.1.25 కోట్లు, విదేశీ సంస్థలైతే 1.90 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించాలి.‘బి’ గ్రేడ్ ఖనిజానికి దేశీయ సంస్థలు రూ.40 లక్షలు, విదేశీ సంస్థలు 60 వేల అమెరిక్ డాలర్లు బిడ్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. టన్ను కనీస టెండర్ ధర ‘ఎ’ గ్రేడ్ రూ.5,000, ‘బి’ గ్రేడ్ రూ.4,000గా ఏపీఎండీసీ నిర్ణయించింది.
ఈ నెల 20వ తేదీ వరకూ బిడ్డర్లు సందేహాలు పంపవచ్చు. రిజిస్టర్డ్ బిడ్డర్లకు ఈ నెల 22న ప్రీబిడ్ కాన్ఫరెన్స్ ఉంటుంది. వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు వచ్చిన బిడ్లనే పరిగణనలోకి తీసుకుంటుంది. అర్హత సాధించిన సంస్థలు/వ్యక్తులను మే 6న ప్రకటిస్తుంది. మే 9న సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ ‘ఈ-టెండర్ కమ్ ఈ-వేలం’ ఉంటుంది.