రైస్ మిల్లులు దాటని రేషన్ బియ్యం
- ఈ నెల 20 వరకు గడువు విధించిన పౌరసరఫరాల శాఖ
సాక్షి, హైదరాబాద్: రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం రైస్ మిల్లుల్లోనే ముక్కిపోతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి రెండు, మూడు నెలల్లో ప్రభుత్వానికి అందించాలి. కానీ, 2013-14 ఏడాదికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటి వరకు అందజేయలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 46 రైస్ మిల్లులపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.
ప్రతి సీజన్‌లో పౌర సరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లకు అందజేస్తుంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రారైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు మిల్లర్లు ఇవ్వాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చినందుకు గానూ ప్రభుత్వం పచ్చి బియ్యానికి క్వింటాల్‌కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తుంది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తుంది.
మిల్లర్లు సకాలంలో బియ్యం అందజేయకపోయినా... పీడీఎస్ అవసరాలకు బియ్యం సరిపోకపోయినా ప్రభుత్వం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. 2014-15 సంవత్సరంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌పై కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ 2013-14 ఏడాది సంబంధించిన కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం సేకరించి ఇచ్చిన ధాన్యంలో 46 మంది మిల్లర్లు ఇంకా 16,270 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని గుర్తించింది.
వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ ఫిబ్రవరి 20 నాటికి బియ్యం అప్పజెప్పని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక 2014-15 ఏడాదిలో సేకరించి మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సైతం ఈ నెల చివరి నాటికి కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలని గడువు విధించింది.