rice ration
-
220 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొత్తగూడెం రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు కొత్తగూడెం సమీపంలో మంగళవారం పట్టుకున్నారు. సివిల్ సప్లై డీటీ కృష్ణప్రసాద్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని వెంకటసాయి ట్రేడర్స్ నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడు లారీ సోమవారం రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు బయలుదేరింది. ఈ క్రమంలో కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలోని లోతు వాగు వద్ద డీటీలు కృష్ణప్రసాద్, రామకృష్ణ, జగదీష్, సోందు మాటువేసి బియ్యం లారీని పట్టుకున్నారు. అందులోనివి రేషన్ బియ్యం అని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంత బియ్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తర్వాత లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ షణ్ముఖ, లారీ యజమాని గార్లపాటి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీటీ కృష్ణప్రసాద్ తెలిపారు. -
రైస్ మిల్లులు దాటని రేషన్ బియ్యం
ఈ నెల 20 వరకు గడువు విధించిన పౌరసరఫరాల శాఖ సాక్షి, హైదరాబాద్: రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం రైస్ మిల్లుల్లోనే ముక్కిపోతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి రెండు, మూడు నెలల్లో ప్రభుత్వానికి అందించాలి. కానీ, 2013-14 ఏడాదికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటి వరకు అందజేయలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 46 రైస్ మిల్లులపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రతి సీజన్లో పౌర సరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లకు అందజేస్తుంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రారైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు మిల్లర్లు ఇవ్వాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చినందుకు గానూ ప్రభుత్వం పచ్చి బియ్యానికి క్వింటాల్‌కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తుంది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తుంది. మిల్లర్లు సకాలంలో బియ్యం అందజేయకపోయినా... పీడీఎస్ అవసరాలకు బియ్యం సరిపోకపోయినా ప్రభుత్వం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. 2014-15 సంవత్సరంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌పై కసరత్తు చేస్తున్న పౌరసరఫరాల శాఖ 2013-14 ఏడాది సంబంధించిన కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం సేకరించి ఇచ్చిన ధాన్యంలో 46 మంది మిల్లర్లు ఇంకా 16,270 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని గుర్తించింది. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ ఫిబ్రవరి 20 నాటికి బియ్యం అప్పజెప్పని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక 2014-15 ఏడాదిలో సేకరించి మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సైతం ఈ నెల చివరి నాటికి కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేయాలని గడువు విధించింది. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
అక్రమార్కుల ‘భాగ్య’ బంగారుపేటలో ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి వేల బస్తాలు స్వాధీనం కోలారు :బంగారుపేటలోని ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి చేసిన రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్ హర్షగుప్త, వేల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్నభాగ్య పథకం ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బంగారుపేటలో అక్రమార్కుల పాలవుతోందని రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో హర్షగుప్త కలెక్టర్ డీకే రవితో కలిసి మిల్లులపై దాడికి బుధవారం ఉపక్రమించారు. కోలారు మెయిన్ రోడ్డులోని చిన్నమ్మాళ్, మోడ్రన్ రైసు మిల్లులపై దాడి చేశారు. ఆ సమయంలో మిల్లు మెయిన్ గేటుకు తాళం వేసి యజమానులు, కార్మికులు పరారయ్యారు. తాళాలు పగులగొట్టి మిల్లులోకి వెళ్లిన కమిషనర్, కలెక్టర్ వేల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో నాలుగు మిల్లులపై కూడా దాడి చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. బంగారుపేటలో అనేక సంవత్సరాలుగా ఈ అక్రమాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారి గాయత్రిదేవిని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని మిల్లుల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని, దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఆయా మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఉంచాలని ఆదేశించారు. -
210క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ :రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో 90 క్వింటాళ్లు, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకుమాను మండలం నుంచి కృష్ణా జిల్లా మోపిదేవికి అక్రమంగా తరలివెళుతున్న రేషన్ బియ్యాన్ని అప్పికట్ల సమీపంలో ఆదివారం ఉదయం స్వాధీనంచేసుకున్నారు. స్థానిక తాలుకా పోలీస్‌స్టేషన్‌లో విజిలెన్స్ డిఎస్పీ పి.అనిల్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్లపాలెం మండలంలోని షేక్ అబీబ్ అనే వ్యక్తి, పట్టణంలోని పరిశా అంకమ్మరావు, నాగరాజులతో కలిసి కాకుమాను, పరిసర ప్రాంతాల్లోని కొందరు డీలర్ల వద్దనుంచి సుమారు 180 బస్తాల (90 క్వింటాళ్లు) రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. ఆ మేరకు విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి లారీని అప్పికట్ల శివారు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ రూ. 2.25 లక్షలు ఉంటుంది. పట్టపగలు, యథేచ్ఛగా ప్రజాపంపిణీ గోతాల్లోనే బియ్యాన్ని అక్రమంగా తరలించడం గమనార్హం! విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని బాపట్ల పౌరసరఫరాల గోడౌన్లో భద్రపరిచి, నిందితులను జేసీ కోర్టుకు హాజరుపరుస్తామని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. షేక్ అబీబ్, నాగరాజు, అంకమ్మరావులు అనేక పర్యాయాలు రేషన్‌బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన విషయాన్ని జేసీ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీరిపై బాపట్ల తాలుకా పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామన్నారు. బియ్యం స్వాధీనం చేసుకున్నవారిలో తాలుకా ఎస్ఐ చెన్నకేశవులు, విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. రైస్‌మిల్లు నుంచి తరలిపోతున్న వైనం.. వెన్నాదేవి (సత్తెనపల్లి రూరల్): వెన్నాదేవి వద్ద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం నిఘా పెట్టి అక్రమంగా లారీలో తరలిస్తున్న 120క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు.. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలోని త్రికోటేశ్వర రైస్‌మిల్లు నుంచి నల్లగొండ జిల్లా హాలియాకు లారీలో వెళ్తున్న 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ వెంకటనారాయణను వివరాలు అడిగి కేసు నమోదుచేశా రు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ కిషోర్‌బాబు, హెడ్‌కానిస్టేబుల్ ఆశీర్వాదం, వీఆర్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును, లారీని సత్తెనపల్లి రూరల్ పోలీసులకు అప్పగిం చారు. డ్రైవర్‌ను సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. -
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
వినుకొండ, న్యూస్‌లైన్: పట్టణంలోని మార్కాపురం రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఉన్న రాంబాబు కిరాణా షాపులో నిల్వ ఉన్న 25క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారు లు మంగళవారం దాడిచేసి పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ సిబ్బంది సుబ్రమణ్యం తెలిపారు. కిరాణా నిర్వాహకునిపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది కోటేశ్వరరావు, సీఎస్‌డీటీ జాన్‌కుమార్, వీఆర్వో సుబ్బయ్య ఉన్నారు. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీ పట్టివేత
రేపల్లె, న్యూస్‌లైన్ :అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని బుధవారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహశీల్దార్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి వచ్చిన సమాచారంతో పెనుమూడి చెక్‌పోస్టువద్ద రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. చీరాల పట్టణం పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్ మిల్లు నుంచి రేషన్ బియ్యాన్ని లారీలో లోడ్‌చేసి రాజమండ్రి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ మేరకు పెనుమూడి-పులిగడ్డ వారధి చెక్‌పోస్టు వద్ద నిఘా ఏర్పాటు చేసి 50 కేజీల 200 బస్తాలతోవున్న 100 క్వింటాళ్ల బియ్యం లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న మరో వ్యక్తి నండూరి శ్రీనివాసరావు పరారయ్యాడు. రేషన్ బియ్యం తరలిస్తున్న పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్ మిల్లుపై ప్రకాశం జిల్లా విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్‌చేశారు. రేషన్ షాపుల్లో పేదలకు అందించే బియ్యంగా నిర్ధారించి 6 ఏ కేసు నమోదుచేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తర లిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. దాడుల్లో పట్టణ సీఐ యూ.నాగరాజు, ఎస్ఐ అవ్వారు వెంకటబ్రహ్మం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఖాసింసైదా, కానిస్టేబుల్ సత్యసాయి, వీఆర్వోలు సర్ధార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.