100 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీ పట్టివేత
Published Thu, Dec 12 2013 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
రేపల్లె, న్యూస్‌లైన్ :అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని బుధవారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహశీల్దార్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డికి వచ్చిన సమాచారంతో పెనుమూడి చెక్‌పోస్టువద్ద రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. చీరాల పట్టణం పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్ మిల్లు నుంచి రేషన్ బియ్యాన్ని లారీలో లోడ్‌చేసి రాజమండ్రి తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
ఆ మేరకు పెనుమూడి-పులిగడ్డ వారధి చెక్‌పోస్టు వద్ద నిఘా ఏర్పాటు చేసి 50 కేజీల 200 బస్తాలతోవున్న 100 క్వింటాళ్ల బియ్యం లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న మరో వ్యక్తి నండూరి శ్రీనివాసరావు పరారయ్యాడు. రేషన్ బియ్యం తరలిస్తున్న పేరాలలోని శ్రీసీతారామాంజనేయ రైస్ మిల్లుపై ప్రకాశం జిల్లా విజిలెన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్‌చేశారు. రేషన్ షాపుల్లో పేదలకు అందించే బియ్యంగా నిర్ధారించి 6 ఏ కేసు నమోదుచేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తర లిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. దాడుల్లో పట్టణ సీఐ యూ.నాగరాజు, ఎస్‌ఐ అవ్వారు వెంకటబ్రహ్మం, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ ఖాసింసైదా, కానిస్టేబుల్ సత్యసాయి, వీఆర్వోలు సర్ధార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement