Published
Tue, Jul 19 2016 8:09 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
పట్టుకున్న బియ్యం లారీతో అధికారులు
కొత్తగూడెం రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు కొత్తగూడెం సమీపంలో మంగళవారం పట్టుకున్నారు. సివిల్ సప్లై డీటీ కృష్ణప్రసాద్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని వెంకటసాయి ట్రేడర్స్ నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడు లారీ సోమవారం రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు బయలుదేరింది. ఈ క్రమంలో కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలోని లోతు వాగు వద్ద డీటీలు కృష్ణప్రసాద్, రామకృష్ణ, జగదీష్, సోందు మాటువేసి బియ్యం లారీని పట్టుకున్నారు. అందులోనివి రేషన్ బియ్యం అని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంత బియ్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తర్వాత లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ షణ్ముఖ, లారీ యజమాని గార్లపాటి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీటీ కృష్ణప్రసాద్ తెలిపారు.