రైస్ మిల్లులపై డీఎస్‌ఓ దాడులు
కావలి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వకుండా బయట మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్నారన్న సమాచారంతో బుధవారం రెండు రైస్‌మిల్లులపై డీఎస్‌ఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మద్దూరుపాడు పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీమారుతి మోడరన్ రైస్ ఇండస్ట్రీస్, మండలంలోని కొత్తసత్రంలో ఉన్న మరో రైస్‌మిల్లులో డీఎస్‌ఓ బృందం తనిఖీలు చేపట్టింది. 5 నెలలుగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి రైతులకు చెందిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే మిల్లర్లు అక్రమంగా బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇందులోని ఒక మిల్లరు గత సీజన్‌లోని ఇలాంటి అక్రమాలకు పాల్పడటంతో ఆ మిల్లు సేల్స్ ట్యాక్స్, ఆర్సీ, ట్రేడర్స్‌ను అధికారులు బ్యాంకులో ఉంచినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్‌కు అదే ప్రాంగణంలో మరో పేరుతో ఆర్సీ అధికారులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ట్రేడర్స్ పేరుతో ఉన్న ఆర్సీని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి స్వీకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ద్వారా మిల్లులకు తెప్పించుకుని బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు డీఎస్‌ఓకు సమాచారం అందడంతో ఆయన ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఉన్న ధాన్యపు నట్టులను టెక్నికల్ సిబ్బంది ద్వారా కొలతలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కొలతలు గురువారం కూడా జరుగుతాయని తర్వాత∙పూర్తి వివరాలు తెలియజేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. డీఎస్‌ఓతో పాటు ఏఎస్‌ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, పుల్లయ్య, డీటీలు సురేంద్ర, హరినాథ్, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.