‘వడ్లు దంచంగా రాడే... వండంగ రాడే...’ వడ్లు దంచుతూ ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లె మహిళలు పాడే పాట. ఇప్పుడంటే రైస్ మిల్లుల్లో బియ్యం పట్టిస్తున్నారు కానీ... తెలంగాణ పల్లెల్లో వెనుకట ఎంత ఉన్నవాళ్లైనా వడ్లు రోట్లో పోసి దంచి బియ్యం చేయటమే. ఆ ప్రక్రియలో శ్రమ అధికం. తమ బలాన్నంతా రోకలిపై ప్రయోగించి దంచాల్సి వచ్చేది. ఆ శ్రమ ఎక్కువగా లేని అనువైన సంప్రదాయ బియ్యం దంపుడు పద్ధతి మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కనిపించింది.
అది కట్టెలతో తయారు చేసిన టెక్కి యంత్రం. రెండు కర్రల మధ్య భారీ చెక్కను పెట్టి, దానికి రోకలిని బిగించారు. ఆ చెక్క(టెక్కి)ని తొక్కితే రోకలి పైకి లేస్తుంది. వదిలేసినప్పుడు కింద సొర్కెలో ఉన్న వడ్లు దంచి బియ్యంగా మార్చేస్తుంది. వాటిని చెరిగి, మిగిలిన మెరిగలను మళ్లీ దంచుతారు. మిల్లుల్లో పాలిష్ చేసిన బియ్యంలో లేని పోషకాలెన్నో ఈ దంపుడు బియ్యంలో ఉంటాయి.
చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్
దంపుడు బియ్యం ప్రయోజనాలు
దంపుడు బియ్యం(ముడి బియ్యం) చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలున్నాయి. ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముడి బియ్యం ఊక నుంచి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దంపుడు బియ్యం తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా రక్త నాళాల్లో కొమ్ము పేరుకోకుండా కాపాడుతుంది.
– చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment