సాక్షిప్రతినిధి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించకపోవడం అంటే ఇదే. ఏ ఒక్క పేదవాడూ ఆకలికి తల్లడిల్లవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం రేషన్‌దుకాణాల ద్వారా అందిస్తోంది. అయితే, ఈ బియ్యం నెలానెలా వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉద్యోగులు, ఏళ్లుగా పాతుకుపోయి చక్రం తిప్పుతున్న మరికొందరు రేషన్‌డీలర్లు, ఇంకొందరు రైస్‌మిల్లుల యజమానులు అంతా కలిసి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు.
ఇందులో ఎవరి వాటాలు వారికి ముట్టజెబుతుండడంతో అంతా గప్‌చుప్‌గా నడిచిపోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిత్యం పదుల సంఖ్యలో రేషన్‌బియ్యం లారీలకు లారీలే మాయమవుతున్నాయి. ఇటు డీలర్లు, అటు సివిల్ సప్లయీస్ ఉద్యోగులు కొందరు అనుసరిస్తున్న విధానం నివ్వెర పరిచేలా ఉంది.
ఇదీ.. కథ
ప్రతినెలా తనకు కేటాయించిన కోటా బియ్యాన్ని మెజారిటీ డీలర్లు గోడౌన్‌ల నుంచి లిఫ్ట్ చేయడం లేదు. ఉదాహరణకు ఒక డీలర్‌కు వంద క్వింటాళ్ల బియ్యం కోటా కేటాయించినట్లయితే, ఆ మొత్తానికి డీడీలు కట్టినా గోడౌన్ల నుంచి కేవలం 75 క్వింటాళ్లు మాత్రం తీసుకుపోయి, మరో 25 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములోనే బ్యాలెన్సు ఉంచుతున్నారు. తమ దుకాణాల పరిధిలో కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేసి అయిపోయిందనపిస్తున్నారు. వాస్తవానికి ప్రతినెలా 20వ తేదీ దాకా రేషన్‌షాపుల్లో బియ్యం, ఇతర సరుకులు వినియోగదారులకు అందాలి. కానీ, అలా జరగడం లేదు. ఇక, గోదాములో బ్యాలెన్సు పెట్టిన బియ్యాన్ని అటు నుంచి అటే మిల్లులకు తరలిస్తున్నారు.
అందరి భాగస్వామ్యంతోనే..
కొందరు డీలర్లు, డిప్యూటీ తహసీల్దారులు(సీఎస్), ఆర్‌ఐలకు, కొన్ని చోట్ల గోడౌన్ల మేనేజర్లకు ఇందులో భాగస్వామ్యం ఉంది. ఈ బియ్యాన్ని కొందరు రైస్‌మిల్లుల యజమానులే నేరుగా కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం సివిల్ సప్లయీస్ ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తి డీ లర్లకు కిలోకు రూ.13, రూ.14, రూ.15 చొప్పున అవసరాన్ని బట్టి చెల్లించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం అత్యధికంగా నార్కట్‌పల్లిలోని ఓ మిల్లుకు, అదే మాదిరిగా హాలియా ప్రాంతంలోని మరో మిల్లుకు చేరుతున్నాయి. ఇటీవల లారీలకు పట్టుకుంటున్నారని గమనించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆటోలను ఐస్‌క్రీం బండ్లలా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు.
షాపుల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాగులు మార్చి అనుమానం రాకుండా జాగత్త్ర పడుతున్నారు మరికొందరు డీలర్లు. కర్నూల్ రైస్, రిలయన్స్ తదితర బ్యాగుల్లో వీటిని నింపి ఊరు దాటిస్తున్నారు. ఇక, బియ్యం రవాణా విషయానికి వస్తే స్టేజ్-1, స్టేజ్-2లలోనే అక్కడక్కడే మారుతూ తతంగమంతా జాగ్రత్తగా నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో పలువురు అధికారులు, యూనియన్ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల మద్దతున్న మిల్లర్లకు భాగస్వామ్యం ఉండడంతో ఎవరిపై ఎలాంటి చర్యలూ ఉండడం లేదు.
కొరవడిన నిఘా...
ఉన్నతాధికారుల నిఘా కొరవడడం వల్లే రేషన్ బియ్యం వినియోగదారులకు అందకుండా మిల్లర్లకు చేరుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలువురు సీనియర్ డీలర్ల వద్ద బోగస్ కార్డులు ఉన్నాయి. బోగస్ కార్డుల ఏరివేతలోనూ అక్రమాలు చోటుచేసుకోవడంతో కొందరి దగ్గర వంద నుంచి రెండొందల దాకా బోగస్‌కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధిక కోటా కేటాయించుకుని అదనపు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఇంకా పలుచోట్ల బినామీ డీలర్లు కూడా ఉన్నారని సమాచారం. డీలర్‌గా పేరొకరిది, రేషన్ దుకాణం నడిపేది మరొకరు. వీరి నుంచి మామూళ్లు ముడుతుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. ఇటీవల హుజూర్‌నగర్ సీఐ ఆధ్వర్యంలో అక్రమంగా రవాణ అవుతున్న రేషన్ బియ్యం లోడు లారీని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నిందితులను శనివారం ఎస్పీ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, పేదోడి బియ్యం పేదోడికే దక్కేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ఉన్నతాధికారులపైనే ఉంది.
పేదోడి బువ్వకు.. ఎసరు!
Published Sun, Oct 6 2013 4:50 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement