ప్రభుత్వం కొత్త పీఆర్‌సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్‌సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో అక్కడి ఉద్యోగుల్లో ఆనందంలో నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటించే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. సరైన ఫిట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఏటా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీ పడలేక వచ్చే వేతనాలతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. వారాంతంలో సరదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వస్తోంది. సినిమాలకు వెళ్లాలన్నా ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. ప్రభుత్వం కొత్త పీఆర్‌సీ ప్రకటించి ఫిట్‌మెంట్ ఇస్తే కొత్త వేతనాలతో కొంత కోలుకుంటామని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బి.కొత్తకోట: ఫిట్‌మెంట్ శాతం ఆధారంగానే ఉద్యోగుల మూల వేతన నిర్ధారణ జరుగుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కూడా పెరుగుతుంది. గడిచిన ఐదేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల సరాసరి అంచనాతో ఫిట్‌మెంట్ ప్రకటించారన్నది ఉద్యోగ సంఘాల వాదన. దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే వేతనం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరాలు తీర్చుకునేందుకు వీలవుతుంది. గతంలో 8వ పీఆర్సీలో 16శాతం, 9వ పీఆర్సీలో 39శాతం, 10వ పీఆర్సీలో 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సుచేశారు. ప్రస్తుతం 69శాతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
2013 జూలైలోనే కొత్త పీఆర్సీ అమలు కావాల్సిన ఉన్నా అమలుకునోచుకోలేదు. ఇప్పటికే 19నెలల కాలాన్ని కోల్పోయిన ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఫలితంగా రెండు పీఆర్‌సీలను కోల్పోవాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఫిట్‌మెంట్ ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడడం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిట్‌మెంట్ ప్రకటిస్తే మూలవేతనం పెరుగుతాయని ఆశతో ఉన్నారు.
ఇదీ చంద్రయ్య బడ్జెట్
పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ కార్యాలయం లో టైపిస్టుగా పనిచేస్తున్న ఆర్.చంద్రయ్య బి.కొత్తకోటలో అద్దెఇంట్లో ఉంటున్నాడు. ఇతనికివచ్చే వేతనంలో కోతపోగా రూ.24,188 వస్తుంది. ఇది చేతికివచ్చిరాగానే కరిగిపోతోంది. ఇంట్లో నిత్యం మందు లు వాడాల్సిన వారి కారణంగా జీతంలో ఎక్కువ సోమ్ము దానికే సరిపోతోంది.
ఇంటిఅద్దె రూ.3,500
పాలు, కూరగాయలకు రూ.3,000
బియ్యానికి రూ.1,200
కరెంట్‌చార్జీ రూ.400
నీటి ట్యాంకర్లు రెండింటీకి రూ.800
బట్టలు ఉతకడం, ఇస్త్రీకి రూ.1,000
కుటుంబానికి అవసరమైన మందులకు రూ.5,000
బంధువుల ఇళ్లకు వెళ్లివచ్చేందుకు రూ.2,000
పిల్లల విద్యకు రూ.2,500
ఇతర ఖర్చులు రూ.2,500
మొత్తం రూ.21,900
ఇక మిగిలిన సోమ్ము కూడా దాచిపెట్టుకునే వీలులే దు. అది కూడా వైద్యానికి వినియోగించాల్సివస్తోం ది. ఇలా అందే వేతనం ఖర్చులకే సరిపోతే భవిష్యత్తుకోసం ఏం దాచుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
ఇది వెంకట్రమణ కష్టం!
పలమనేరు: పలమనేరు తహశీల్దార్ కార్యాలయానికి సంబంధించి జగమర్ల వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు వెంకట్రమణ. చాలీచాలని జీతంతో ఇళ్లు గడవడమే కష్టంగా మారిన తరుణంలో రాష్ర్టప్రభుత్వం ఫిట్‌మెంట్‌నైనా ప్రకటిస్తే జీతానికి ఏకొంతో చేరుతుందని ఆశపడ్డాడు. కానీ ఆ సగటు ఉద్యోగి ఆశలు అడియాశలే అయ్యాయి. గంగవరం మండ లం కీలపట్లకు చెందిన వెంకట్రమణ పదేళ్లకు పైగా ఈ ఉద్యోగంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల రూ.6,300 జీతం. అది కూడా ఏ రెండు నెలలకో, మూడు నెలలకో మాత్రమే అందుతోంది.
జీతంపై ఆధారపడి జీవించే ఇతను ప్రతి నెలా అప్పులతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు ఎట్టాగో పెళ్ళిళ్ళు చేశాడు. కొడుకు పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తొడుక్కోవడానికి సరైన బట్టలు లేకపోవడంతో పలమనేరు ఎంపీడీవో బాలాజీ కొంత ఆర్థిక సాయం చేసి బట్టలు కొనిచ్చారు. ఇక కళాశాలలో ఫీజు కట్టేందుకు ఇబ్బంది ఎదురైతే కళాశాల కరస్పాండెంట్ కనుకరించారు.
గతంలో ఈయన భార్య చనిపోయింది. ఇతనితో పాటు పుట్టిన అక్కా చెల్లెళ్లు నలుగురు వారి బాగోగులు వెంకట్రమణే చూసుకోవాలి. ప్రస్తుతం భర్త చనిపోయిన ఓ చెల్లె ఇంట్లోనే ఉంది. వచ్చే జీతంతో ఈ కష్టాలను ఎదురీదాలా. తనకు రెండెకరాల మెట్టపొలముంది. వర్షాలు రాక వేరుశెనగ చేతికొచ్చి ఐదారేళ్లయ్యింది. నెలకు ఇంట్లో బియ్యానికి రూ.2వేలు కావాల్సిందే. ఆస్పత్రులు, చదువు తదితరాలకు నెలకు ఎంతలేదన్నా రూ.10వేల దాకా ఉండాల్సిందే. కానీ అతనికొచ్చే జీతం ఏ మాత్రం చాలదు. కనీసం ఫిట్‌మెంట్‌తోనైనా ఓ వెయ్యి పెరుగుతుందేమోనని ఆశించాడు. ఇప్పటికే అప్పు రూ.20వేలు దాటింది. చాలీచాలని జీతాలతో జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంగాక బాధపడుతున్నాడు.
2004 పునరావృతం అవుతుంది
నేను మారాను. నన్ను గెలిపిస్తే మంచి పాలన అందిస్తాను. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వం అని చెప్పుకునేలా వ్యవహరిస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఖాళీ ఖజానా, కేంద్రం ఆర్థిక సాయం నిరాకరణ, రాష్ట్ర విభజన వంటి కుంటి సాకులతో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికలు పునరావృతం అవుతాయి.
-ఎస్.బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరిషత్(ఆపస్)
డీఏకు కోత విధించడం బాధాకరం
ఖాళీ ఖజానా పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు గతంలో ఇస్తున్న 0.856డీఏను ప్రస్తు తం 0.524శాతానికి కోత విధించడం బాధాకరం. దీనివల్ల జీతాలపై ఆధారపడ్డ మధ్య తరగతి ఉద్యోగులు చాలా నష్టపోతారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల డీఏలో కోత విధించడం సరికాదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రకటించకుండా జాప్యం చేయడం తగదు. ముఖ్యమంత్రి స్పందించి తెలంగాణ ప్రభుత్వం కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి.
-టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షులు,
రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్(ఆర్‌జేయూపీ), తిరుచానూరు.
చాలీచాలని జీతాలు
ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా వూరింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, పిల్లలు చదువులు, కుటుంబానికి సంబంధించిన ఇతర ఖర్చులు చూస్తుంటే ఇప్పుడు వస్తున్న జీతం చాలక ప్రతినెలా అప్పు చేయూల్సిన పరిస్థితి నెలకొంది. 2009లో అప్పటి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 2013 జూలై నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వాలి. పీఆర్సీ కమిటీ 29 శాతం పెంచవుని చెప్పడంతో ఇప్పుడు పెంచినా కేవలం 2 శాతమే పీఆర్సీ పెరుగుతుంది. వెంటనే పీఆర్సీ 65 శాతం పెంచి ఉద్యోగులను ఆదుకోవాలి.
- మోహన్, ఉపాధ్యాయుడు, బాలుర ఉన్నత పాఠశాల, శ్రీకాళహస్తి
మావి చాలీచాలని బతుకులు
పొరుగు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ను ప్రకటించింది. ఇక్కడేమో సరిగ్గా జీతాలు కూడా ఇవ్వడం లేదు. మాలాంటి బక్క ఉద్యోగుల పరిస్థి తి దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి తమలాంటోళ్లను ఆదుకోవాలి.
-దేవేంద్రుడు, వీఆర్‌ఏల సంఘ నాయకులు, పలమనేరు
ఉద్యోగస్తులు బాగుండాలి
తెలంగాణలోని ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చినట్టుగానే ఇక్కడా ఇవ్వాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహించాలి. ఇక్కడి ప్రభుత్వమేమో ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోంది. మధ్య తరగతి ఉద్యోగులకు ఆసరాగా నిలిచే ఫిట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి.
-పుష్పరాజ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయసంఘ నాయకులు
త్వరలో వస్తుందనుకుంటున్నాం
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తుందనే అనుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిన నేపథ్యంలో సగటు ఉద్యోగుల పరిస్థితి కష్టాలమయమే. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
- సోమచంద్రారెడ్డి,
యూటీఎఫ్ నాయకులు
అమ్మో.. ఒకటో తారీఖు..
Published Sun, Feb 8 2015 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement