సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైస్ మిల్లులు, ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించి అక్రమ నిల్వలపై పౌర సరఫరాలశాఖ 2012లో జిల్లా వ్యాప్తంగా 320 కేసులు నమోదు చేసింది. సన్న బియ్యం ధర క్వింటాల్‌కు గత ఏడాది రూ.3400 ఉండగా ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇప్పుడది రూ.4200గా ఉంది. బియ్యంతోపాటు అన్ని సరుకుల ధరల తీరు ఇలాగే ఉంది. కానీ, కేసుల నమోదు మాత్రం పెరగలేదు. 2013లో ఆగస్టు వరకు (ఎనిమిది నెలలు) 92 కేసులు మాత్రమే నమోదు చేసింది. ధరలు పెరిగినప్పుడు విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన నిఘా విభాగం ఈ పనిని పక్కనబెట్టింది. తనిఖీలు ఎందుకు పెరగడం లేదనే ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ఏడాది నమోదు చేసిన తక్కువ కేసుల్లో సైతం అధికారులు స్వయంగా దాడులు చేసిన వాటికంటే ఇతరులు ఫిర్యాదు చేస్తే నమోదు చేసినవే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తోడు బడా వ్యాపారులు, రైస్ మిల్లర్లతో... అధికారులకు ఉన్న అనుబంధాలే తనిఖీలు తగ్గడానికి ప్రధాన కారణమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇంత తక్కువ తనిఖీలు జరిగిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవని అంటున్నారు.
ఒక్క కేసూ పెట్టరా...
పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో 27 మంది నిఘా సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు ప్రతి మండలంలో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డెప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. రెవెన్యూ వారిని మినహాయించినా... పౌర సరఫరాల శాఖలోని 27 మంది సిబ్బంది నెలకు ఒకటి చొప్పున తనిఖీలు చేసినా 27 అవుతాయి. ఆ లెక్కన ఈ ఎనిమిది నెలల్లో 251 కేసులు అయ్యేవి. వ్యాపారులు, రైస్ మిల్లర్లతో జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా అధికారులు తనిఖీలు తగ్గించేశారు. అడపాదడపా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలు చేసి అక్రమ నిల్వలు గుర్తించినా కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. జిల్లా అధికారుల సహకారంతో కేసులు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా పౌరసరఫరాల శాఖను కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం జరిగిన జిల్లా ఆహార సలహా సంఘం సమావేశంలో అక్రమ నిల్వలపై కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. చౌకధరల దుకాణాలు, నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేసిన వారిపై గతేడాది, ఈ ఏడాది నమోదు చేసిన కేసుల సంఖ్యలో తేడాపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు.
ఇలా ఎందుకు జరుగుతోందని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్‌ను గట్టిగా ప్రశ్నించారు. రేషన్ షాపుల్లోనూ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని గ్రామ సందర్శనలో ఫిర్యాదులు వస్తున్నా ఏం చేస్తున్నారని అడిగారు. నిఘా విభాగం ఏం చేస్తోందని, నెలకు ఒక్క కేసు కూడా నమోదు చేయని సిబ్బంది ఉన్నారా? అని మందలించారు. తనిఖీల విషయంలో తీరు మారకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీఎస్వో మిన్నకుండిపోయారు. కలెక్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో జిల్లా పౌర సరఫరాల శాఖలో నిఘా విభాగం పూర్తిగా నిద్రావస్థలో ఉందని తెలుస్తోందని సమావేశంలో ఉన్న మిగతా సభ్యులు అభిప్రాయపడ్డారు. జిల్లా సరఫరా అధికారి ఉదాసీనత వల్లే తనిఖీలు తగ్గాయని వీరంతా వ్యాఖ్యానించారు. కలెక్టర్ సమీక్ష తర్వాతైనా నిఘా విభాగం నిద్రమత్తు వీడుతుందో లేదో చూడాలి మరి !
జోగుతున్న నిఘా
Published Thu, Sep 12 2013 1:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement