సాక్షి, హైదరాబాద్: గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి లెవీ బకాయిలు ఉన్నాయంటూ 3 వేల రైస్ మిల్లులను భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టడంపై మిల్లర్లు మండిపడ్డారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో లెవీ తీసుకోబోమనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును శుక్రవారం సచివాలయంలో కలిసి ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేశారు.
ఆధారాలతో సహా మంత్రికి పరిస్థితి వివరించారు. ‘గత సీజన్‌లో 55 లక్షల టన్నుల లెవీ(98.5 శాతం) బియ్యం ఇచ్చాం. 2-3 % లెవీ బియ్యం బకాయిలు ఉన్న కొన్ని మిల్లులను కూడా బ్లాక్‌లిస్టులో పెడతారా?’ అని మిల్లర్లు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.