సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం రాష్ర్టం వచ్చిన ముగ్గురు వలస జీవుల బతుకులు తెల్లాయిపోయాయి. పొద్దంతా పనిచేసిన అలసటతో ఆదమరిచి నిద్రపోతున్న వారిని లారీ తొక్కడంతో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రవిశంకర్ రైస్‌మిల్లులో శనివారం వేకువజామున జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండ లం కల్యాణ్‌పూర్ గ్రామానికి చెందిన పదిహేను మంది కార్మికులు వారం రోజుల క్రితం రైస్‌మిల్లులో పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకేచోట వరుసగా పడుకున్నారు. రాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాల విరమణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు.
అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోగా వెనుక చక్రాల కింద ముగ్గురు నలిగిపోయారు. పొట్ట, ఛాతి భాగం మీదుగా లారీ ఎక్కింది. తీవ్రగాయాలైన సుకేందర్‌సదా(22) ఆర్తనాదాలు చేయడంతో మిగతా వారికి మెళకువ వచ్చింది. ప్రాణభయంతో అందరూ గట్టిగా అరవడంతో సాయిలు లారీని నిలిపివేసి అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే దీప్‌సదా(20), శ్యాంసుందర్ సదా(25) మృతి చెందారు. సుకేందర్‌సదాను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. అతడు ఆర్తనాదాలు చేయడం వల్లే తమకు మెళకువ వచ్చిందని, లేకుంటే తామంతా ప్రాణాలు కోల్పోయేవారమని ప్రత్యక్ష సాక్షులు రంజిత్‌సదా, మంజులసదా, శ్యామ్‌సావ్, అనిల్‌సదా బోరున విలవిస్తూ చెప్పారు. లారీ క్లీనర్ సాయిలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ముగ్గురు వలస జీవుల ప్రాణాలు గాలిలో కలిశాయని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కార్మిక సంఘ నేతలు రాములుగౌడ్, కృష్ణారెడ్డి సందర్శించి కార్మికులకు సంతాపం తెలిపారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి కల్వల శ్రీనివాస్ అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై రామకృష్ణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైస్‌మిల్లు నిర్వాహకులు మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు అంత్యక్రియల కోసం రూ.50వేలు ఇచ్చారు.
తెల్లారిన బతుకులు
Published Sun, May 25 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement