రైసుమిల్లుపై విజిలెన్స్ దాడులు
-
62 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
వనంతోపు (పొదలకూరు) : మండలంలోని వనంతోపు సెంటర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర రైసుమిల్లుపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 62 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. శుక్రవారం పొదలకూరుకు సమీపంలో 14 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నట్టు తెలిపారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వనంతోపు రైసుమిల్లుపై నిఘా పెట్టామన్నారు. ఈ రైసుమిల్లులో 2014లో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. ఆటోలో తరలిస్తున్న 14 బస్తాల బియ్యం కూడా వెంకటేశ్వర రైసుమిల్లుకేనని డ్రైవర్ తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిపారు. మొత్తం 40 క్వింటాళ్ల బియ్యం రూ.92 వేలు విలువైనవిగా పేర్కొన్నారు. 6ఏ కేసును నమోదు చేయనున్నట్టు చెప్పారు. పొదలకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణామర్చంట్స్, రేషన్ షాపుల నుంచి రైసుమిల్లు యజమాని బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టించి సీఎంఆర్ బియ్యంలో కలిపి ప్రభుత్వ గోదాములకు పంపుతున్నట్టు వెల్లడించారు. వెంకటేశ్వర రైసుమిల్లుకు సీఎంఆర్ ధాన్యం సేకరించేందుకు ఈ ఏడాది అనుమతులు ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పొదలకూరు కిరాణా మర్చంట్స్‌లో 250 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. రేషన్‌కార్డుహోల్డర్లు బియ్యంను అమ్మితే కార్డులను రద్దు చేస్తామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై అళహరి వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, పొదలకూరు సీఎస్‌డీటీ గిరి, సిబ్బంది పాల్గొన్నారు.