Podalakur
-
మా ఇష్టం.. అమ్మేస్తాం!
సాక్షి, పొదలకూరు: పొదలకూరు ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డులోని దుకాణాలను కొందరు తమ సొంత ఆస్తిలా అమ్మేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే వారు లేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో వ్యాపారాలు చేయని వారికి దుకాణాలను కేటాయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిజమైన వ్యాపారులు మాత్రం దుకాణాల్లేక ఎక్కడో ఉండి షాపులు పొందిన వారికి అధికంగా అద్దెలు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నారు. యార్డులో అధికారులను లెక్క చేయకుండా ఒక ప్రత్యేక ప్రభుత్వమే నడుస్తోందనే విమర్శలున్నాయి. మార్కెటింగ్ శాఖ అధికారుల ఉదాసీన వైఖరి, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అద్దెలు చెల్లించి వ్యాపారాలు చేసుకోవాల్సిన దుకాణాలను అనధికారికంగా అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం యార్డులో 23 పాత దుకాణాల్లో సుమారు రెండు దశాబ్దాలుగా కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. 2010 సంవత్సరంలో అదనంగా ఆరు దుకాణాలు, గతేడాది మరో పది దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం 14 దుకాణాల సముదాయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు కట్టిస్తున్నారు. అమ్మకానికి దుకాణాలు ప్రస్తుతం నిమ్మమార్కెట్ యార్డులో దుకాణాల అమ్మకం చర్చనీయాంశంగా మారింది. మొదట నిర్మించిన ఆరు దుకాణాలను అప్పట్లో కొందరికి కేటాయించడంతో వారు అమ్మకానికి పెట్టారు. ఒక్కో దుకాణం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. దుకాణాల్లేని నిజమైన వ్యాపారులు తమ అవసరాల కోసం విధిలేని పరిస్థితుల్లో షాపులు కొనుగోలు చేయడం లేదా అదనంగా అద్దెలు చెల్లించడం జరుగుతోంది. యార్డు ఏర్పడిన తొలిరోజుల్లో కేటాయించిన దుకాణాలను సైతం కొందరు అద్దెలకు ఇచ్చి చాలా ఏళ్లుగా నగదు వసూలు చేస్తున్నారు. గతేడాది అదనంగా నిర్మించిన పది దుకాణాలను ఇప్పటివరకు వ్యాపారులకు కేటాయించలేదు. ఇందులో రాజకీయాలు చోటుచేసుకోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో వేలంపాటలు రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దుకాణాలు ఖాళీగానే ఉన్నాయి. ఎమ్మెల్యే కాకాణి ఆగ్రహం నిమ్మమార్కెట్ యార్డులో ప్రభుత్వ దుకాణాలను సొంత ఆస్తిగా పరిగణించి అమ్మడాన్ని దుకాణాల్లేని వ్యాపారులు కొందరు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మార్కెటింగ్ శాఖ దుకాణాలను అమ్మడం ఎక్కడా చూడలేదని, ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడినట్టుగా సమాచారం. నిజంగా వ్యాపారాలు చేసుకునే వారికి దుకాణాలను కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మార్కెటింగ్ కమిటీలకు ఎమ్మెల్యేలు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తారని ఇలాంటి అవినీతి కార్యకలాపాలను సహించేది లేదన్నట్టుగా సమాచారం. అంతేకాక రాపూరు మార్కెట్ కమిటీ సెక్రటరీని వెంటనే సమాచారం అందజేయాలని, దుకాణాలు అమ్మిన వారి వివరాలు నివేదించాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. నోటీసులు అందజేశాం యార్డులో దుకాణాలు ఎవరిపేరుపై ఉన్నాయో వారే వ్యాపారం చేసుకోవాలి. ఇతరులు వ్యాపారాలు చేసుకుంటుంటే నోటీసులు అందజేశాం. యార్డులో వ్యాపారుల వివరాలను సేకరించి నివేదిక రూపొందిస్తున్నాం. దుకాణాలు పొంది ఇతరులకు అద్దెలకు అందజేస్తే వారి అనుమతులను రద్దు చేయడం జరుగుతుంది. – అనితాకుమారి, సెక్రటరీ, రాపూరు మార్కెట్ కమిటీ -
పొదలకూరులో అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం
-
రైసుమిల్లుపై విజిలెన్స్ దాడులు
62 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం వనంతోపు (పొదలకూరు) : మండలంలోని వనంతోపు సెంటర్లో ఉన్న శ్రీవెంకటేశ్వర రైసుమిల్లుపై శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 62 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. శుక్రవారం పొదలకూరుకు సమీపంలో 14 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నట్టు తెలిపారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వనంతోపు రైసుమిల్లుపై నిఘా పెట్టామన్నారు. ఈ రైసుమిల్లులో 2014లో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు గుర్తు చేశారు. ఆటోలో తరలిస్తున్న 14 బస్తాల బియ్యం కూడా వెంకటేశ్వర రైసుమిల్లుకేనని డ్రైవర్ తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిపారు. మొత్తం 40 క్వింటాళ్ల బియ్యం రూ.92 వేలు విలువైనవిగా పేర్కొన్నారు. 6ఏ కేసును నమోదు చేయనున్నట్టు చెప్పారు. పొదలకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణామర్చంట్స్, రేషన్ షాపుల నుంచి రైసుమిల్లు యజమాని బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టించి సీఎంఆర్ బియ్యంలో కలిపి ప్రభుత్వ గోదాములకు పంపుతున్నట్టు వెల్లడించారు. వెంకటేశ్వర రైసుమిల్లుకు సీఎంఆర్ ధాన్యం సేకరించేందుకు ఈ ఏడాది అనుమతులు ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పొదలకూరు కిరాణా మర్చంట్స్‌లో 250 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. రేషన్‌కార్డుహోల్డర్లు బియ్యంను అమ్మితే కార్డులను రద్దు చేస్తామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై అళహరి వెంకటేశ్వర్లు, ఏఓ ధనుంజయరెడ్డి, పొదలకూరు సీఎస్‌డీటీ గిరి, సిబ్బంది పాల్గొన్నారు. -
నిమ్మ రైతులకు శుభవార్త
త్వరలో పొదలకూరు యార్డులో ఈ – మార్కెట్ ఏర్పాటు దేశ మార్కెట్‌ను అనుసరించి ధరల ప్రదర్శన నిమ్మ రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు యార్డులో బయ్యర్లు, సేల్స్ అనే రెండు విధాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బయ్యర్లకు రైతులు నేరుగా కాయలను తోలితే వారు ఢిల్లీ మార్కెట్‌ను అనుసరించి ధరలను అందజేస్తుంటారు. అలాగే సేల్స్ వ్యాపారులు రైతుల పంపించే కాయలను వేలంపాట ద్వారా బయ్యర్లకు అమ్ముతుంటారు. ఇందుగాను రైతుల నుంచి కమిషన్ వసూలు చేస్తారు. ఈ వ్యవహారం రైతు, వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలు, నమ్మకంపై జరిగిపోతుంది. కాయలను మార్కెట్‌కు తోలే రైతులు దుకాణానికి రాకుండానే వ్యాపారులు ధరలను నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ధరల విషయంలో నష్టపోకుండా చూసేందుకు ఈ–మార్కెటింగ్‌ను తీసుకువచ్చింది. దేశంలోని 21 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెటింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రాలతో సంప్రదించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతగా దేశంలోని 200 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఈ–మార్కెట్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతుండగా అందులో పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డు ఉండడం విశేషం. ఇందుకోసం యార్డును అసిస్టెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అడ్వైయిజర్(కేంద్ర ప్రభుత్వ అధికారి) ఎం జవహర్ పరిశీలించారు. సెప్టంబరు చివరి నాటికి యార్డులో ఈ–ట్రేడింగ్ ద్వారా నిమ్మకాయలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ–మార్కెట్ సౌకర్యాలు ఈ–మార్కెట్ విధానంలో రైతు తన మొబైల్ నుంచే కాయల ధరలను పరిశీలించేందుకు వీలుకలుగుతుంది. దేశ మార్కెట్‌ను అనుసరించి యార్డ్‌లో నిత్యం ధరలను ప్రదర్శిస్తారు. యార్డుకు వచ్చే కాయల వివరాలను ముందుగా వ్యాపారులు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత కాయల ధరలను నిర్ణయిస్తారు. బయటి మార్కెట్, స్థానిక మార్కెట్ ధరలను తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. వ్యాపారులు నిర్ణయించిన ధరలతో పనిలేకుండా ఆన్లైన్లో ధరలను చూసుకుని రైతులు తమ కాయలకు ధర నిర్ణయించుకోవచ్చు. ఈ–మార్కెట్ ప్రయోజనం: ఎం.శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈ–మార్కెట్‌తో రైతులకు ప్రయోజనం. పొదలకూరు యార్డులోని రైతుల విశ్రాంతి గదిలో రూ.30లక్షలతో ఈ–మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైతుల విశ్రాంతి గదులను ఈ–మార్కెట్ పైన నిర్మిస్తాం. -
పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధం
త్రుటిలో తప్పిన ప్రమాదం పొదలకూరు : పట్టణంలోని పద్మావతినగర్‌లోని ఓ తాటి చెట్టుపై గురువారం సాయంత్రం పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో చుట్టుపక్కల నివాసితులు హడలిపోయారు. ఒక్కసారిగా వేల వాట్స్ లైట్లు వెలిగినట్టుగా నివాసాల ముందు వెలుగు, శబ్ధం రావడంతో భయకంపితులయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. వినాయకమాన్యం, శ్రామికనగర్ కాలనీవాసులు పిడుగు పడిన మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. పిడుగు పడే సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు అయింది. పిడుగు పడిన తాటిచెట్టుకు సమీపంలో ఆదెమ్మ నివాసం ఉంటుంది. అయితే ఆమెకు ప్రమాదం తప్పింది. పిడుగుపాటుతో పద్మావతినగర్, తొగటివీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
పొదలకూరులో రైతుల ఆందోళన
పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వద్ద రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల తర్వాత కాయలతో మార్కెట్‌కు వస్తేనే కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చేసి గేట్లను మూసివేయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారుల ధోరణిపై మండిపడ్డారు. ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి రంగలోకి దిగి సర్దుబాటు చేశారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పొదలకూరు (నెల్లూరు) : ఇంట్లో కరెంట్ రాకపోవడంతో తీగలు సరిచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ ఖాజామొయినొద్దీన్(30) ఇంట్లో రెండు రోజులుగా వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే చోరీ..
పొదలకూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. స్థానిక మారుతీనగర్‌లో ఉండే వెంకట నారాయణ, ఆయన భార్య మహ్మదాపురం పీహెచ్సీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం దంపతులు విధులకు వెళ్లగా, వారి కుమార్తె స్కూలుకు వెళ్లింది. తిరిగి సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన వారి కుమార్తె ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించింది. ఆభరణాలు పోయినట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు వచ్చి సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అహ్మద్‌బాషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మారు తాళంతో తలుపులు తెరిచి, చోరీ అనంతరం తిరిగి తాళం వేశారని సమాచారం.