గతేడాది నిర్మించిన పది దుకాణాలు, అదనంగా నిర్మించిన ఆరు దుకాణాల సముదాయం
సాక్షి, పొదలకూరు: పొదలకూరు ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డులోని దుకాణాలను కొందరు తమ సొంత ఆస్తిలా అమ్మేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే వారు లేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో వ్యాపారాలు చేయని వారికి దుకాణాలను కేటాయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. నిజమైన వ్యాపారులు మాత్రం దుకాణాల్లేక ఎక్కడో ఉండి షాపులు పొందిన వారికి అధికంగా అద్దెలు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నారు. యార్డులో అధికారులను లెక్క చేయకుండా ఒక ప్రత్యేక ప్రభుత్వమే నడుస్తోందనే విమర్శలున్నాయి. మార్కెటింగ్ శాఖ అధికారుల ఉదాసీన వైఖరి, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అద్దెలు చెల్లించి వ్యాపారాలు చేసుకోవాల్సిన దుకాణాలను అనధికారికంగా అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం యార్డులో 23 పాత దుకాణాల్లో సుమారు రెండు దశాబ్దాలుగా కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. 2010 సంవత్సరంలో అదనంగా ఆరు దుకాణాలు, గతేడాది మరో పది దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం 14 దుకాణాల సముదాయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు కట్టిస్తున్నారు.
అమ్మకానికి దుకాణాలు
ప్రస్తుతం నిమ్మమార్కెట్ యార్డులో దుకాణాల అమ్మకం చర్చనీయాంశంగా మారింది. మొదట నిర్మించిన ఆరు దుకాణాలను అప్పట్లో కొందరికి కేటాయించడంతో వారు అమ్మకానికి పెట్టారు. ఒక్కో దుకాణం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. దుకాణాల్లేని నిజమైన వ్యాపారులు తమ అవసరాల కోసం విధిలేని పరిస్థితుల్లో షాపులు కొనుగోలు చేయడం లేదా అదనంగా అద్దెలు చెల్లించడం జరుగుతోంది. యార్డు ఏర్పడిన తొలిరోజుల్లో కేటాయించిన దుకాణాలను సైతం కొందరు అద్దెలకు ఇచ్చి చాలా ఏళ్లుగా నగదు వసూలు చేస్తున్నారు. గతేడాది అదనంగా నిర్మించిన పది దుకాణాలను ఇప్పటివరకు వ్యాపారులకు కేటాయించలేదు. ఇందులో రాజకీయాలు చోటుచేసుకోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో వేలంపాటలు రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దుకాణాలు ఖాళీగానే ఉన్నాయి.
ఎమ్మెల్యే కాకాణి ఆగ్రహం
నిమ్మమార్కెట్ యార్డులో ప్రభుత్వ దుకాణాలను సొంత ఆస్తిగా పరిగణించి అమ్మడాన్ని దుకాణాల్లేని వ్యాపారులు కొందరు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మార్కెటింగ్ శాఖ దుకాణాలను అమ్మడం ఎక్కడా చూడలేదని, ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడినట్టుగా సమాచారం. నిజంగా వ్యాపారాలు చేసుకునే వారికి దుకాణాలను కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మార్కెటింగ్ కమిటీలకు ఎమ్మెల్యేలు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తారని ఇలాంటి అవినీతి కార్యకలాపాలను సహించేది లేదన్నట్టుగా సమాచారం. అంతేకాక రాపూరు మార్కెట్ కమిటీ సెక్రటరీని వెంటనే సమాచారం అందజేయాలని, దుకాణాలు అమ్మిన వారి వివరాలు నివేదించాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.
నోటీసులు అందజేశాం
యార్డులో దుకాణాలు ఎవరిపేరుపై ఉన్నాయో వారే వ్యాపారం చేసుకోవాలి. ఇతరులు వ్యాపారాలు చేసుకుంటుంటే నోటీసులు అందజేశాం. యార్డులో వ్యాపారుల వివరాలను సేకరించి నివేదిక రూపొందిస్తున్నాం. దుకాణాలు పొంది ఇతరులకు అద్దెలకు అందజేస్తే వారి అనుమతులను రద్దు చేయడం జరుగుతుంది.
– అనితాకుమారి, సెక్రటరీ, రాపూరు మార్కెట్ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment