
హనుమాన్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు పేరుతో మైనింగ్ అధికారులిచ్చిననోటీసు
సాక్షి, గుంటూరు: చీకట్లో నల్లపిల్లిని వెతుకుతున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలను మైనింగ్ అధికారులు నిజం చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి నోటీసులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో చేయిస్తున్న విచారణ తీరే ఇందుకు నిదర్శనం. హైకోర్టు మొట్టికాయలు మొట్టడంతో తామేదో పొడిచేస్తాం.. అక్రమాలను నిగ్గుతేలుస్తాం అన్నట్టుగా ఫోజు పెట్టి విచారణ మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా మారింది. ఉండటానికి సరైన నివాసం కూడా లేని వాళ్లు వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించి రూ.కోట్లు సంపాదించారని, అలాగే 1998లో మరణించిన వ్యక్తి 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడంటూ నోటీసులిచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ పేరుతో మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి స్వామిభక్తి చాటుకోవడంలో భాగంగా పత్తి, బియ్యం, మైదాపిండి మిల్లుల వారికి కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాలతో సంబంధం ఉందని నోటీసులిచ్చి, మిల్లులను మూతవేయించారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టుకు ఈ జాబితాను కూడా నివేదించడం గమనార్హం.
తమ ఎమ్మెల్యేను కాపాడేందుకే...
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ పెద్దలను తప్పించే యత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణను సీబీసీఐడీకి అప్పగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేస్తున్న విచారణ తీరు ఈ ఆరోపణలను బలపరుస్తోంది. అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన వారిని వదిలేసి సంబంధంలేని ముగ్గురాయి మిల్లుల యజమానులను, అమాయక కూలీలు, టిప్పర్, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు సైతం నోటీసులు జారీచేస్తున్నారు. పైగా వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు.
రైస్‌మిల్లులు, కాటన్ మిల్లులకు అక్రమ మైనింగ్‌కు సంబంధం ఏంటనేది మైనింగ్ అధికారులు, సీబీసీఐడీ అధికారులకే తెలియాలి. మైనింగ్ మాఫియా నుంచి తెల్లరాయి కొనుగోలు చేసి ముగ్గు, చిప్స్ తయారు చేసే మిల్లులకు నోటీసులు ఇస్తే పర్వాలేదు. నిజంగా ముగ్గు, పల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నప్పటికీ ఆ పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ బిల్డింగ్‌లో రైస్ మిల్లు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, ఇతర పరిశ్రమలు నడిచాయనే అవగాహన కూడా లేకుండా ఆ పేర్లతో నోటీసులు జారీ చేశారు. తాము తప్పించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేత ఏస్థాయిలో తన పరపతిని ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు.
నోటీసులు ఇచ్చాం
విద్యుత్ శాఖ అధికారుల నుంచి సేకరించిన మీటర్ల ఆధారంగా మిల్లులకు నోటీసులిచ్చాం. గతంలో కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లులు ఇలా ఏ పరిశ్రమ పేరుతో అయితే కరెంటు మీటరు తీసుకున్నారో ఆ పేరుతో నోటీసులిచ్చాం. ఆపేరుతో అక్కడ పరిశ్రమ నడవకపోతే యజమానులు మాకు తెలియజేయాలి. వెంటనే మా అధికారులను పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వారు చెప్పినట్లు మైనింగ్‌కు సంబంధం లేని పరిశ్రమ అయితే నోటీసులు వెనక్కు తీసుకుంటాం.
– విష్ణువర్ధన్, మైనింగ్ ఏజీ
Comments
Please login to add a commentAdd a comment