పురుగు మందు డబ్బాలతో రోడ్డెక్కిన మైలారం గ్రామస్తులు
గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా హరగోపాల్‌ను అడ్డుకున్న పోలీసులు
బల్మూర్/వెల్దండ: మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.
దాదాపు గంటసేపు వారిని స్టేషన్‌లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు.
ఆరు గంటలపాటు ఉద్రిక్తత
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్
దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment