విజయనగరం కంటోన్మెంట్ :జిల్లాలోని రైస్ మిల్లులపై అధికారులు రెండు రోజులకే దాడులను ముగించారు. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జిల్లాలో ఒకే రోజున నాలుగైదు మిల్లులను తనిఖీ చేశారు. అనంతరం 21న బలిజిపేటలో ఒక మిల్లును తనిఖీ చేశారు. దీంతో తనిఖీలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టే. అటు విజిలెన్స్ కాని, ఇటు పౌర సరఫరాల శాఖ కాని చేపట్టిన తనిఖీల్లో మిల్లుల పొరపాట్లు ఏమీలేవని తేల్చేశారు. దీంతో అధికారులు కూడా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక విజిలెన్స్ అధికారులు మాత్రం దాడులు నిర్వహించాక నివేదికను కూడా పౌర సరఫరాల శాఖకు ఇవ్వలేదు. దీంతో వారి తరఫున కూడా ఎటువంటి చర్యలూ లేవని చెబుతున్నారు. ఈ తనిఖీల ద్వారా అక్రమా లు వెలుగులోకి వస్తాయనుకుంటే.. సాదాసీదాగా ఉండడంతో మిల్లర్లు ఖుషీగా ఉన్నారు. అసలు దీనంతటికీ కారణం ప్రభుత్వ పెద్దల ఆదేశాలేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు ప్రభుత్వ పరమైన కొన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్నందున వారికి సహాయంగా ఈ తనిఖీలను మమ అనిపించాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం.
వినియోగించని బియ్యం ఏమవుతున్నట్టు..?
జిల్లాలో వినియోగించ ని రేషన్ బియ్యం ఏమవుతున్నట్టో అధికారులకే చెప్పాలి. వాస్తవానికి జిల్లాలో చాలామంది కార్డుదారు లు ఈ బియ్యాన్ని వినియోగించడం లేదు. బియ్యాన్ని గ్రామం నుంచి మండలంతో పాటు డివిజన్ స్థాయిలో చాలా మంది వ్యా పారులు ఓ ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. కానీ మిల్లర్లు మాత్రం తమ కు ఎటువంటి రేషన్ బియ్యం రావని, వచ్చినా తామే అధికారులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు.
మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం తరలించండి
జిల్లాలోని 118 రైస్ మిల్లుల్లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా ధాన్యం వేయించుకుని చోద్యం చూస్తున్న మిల్లుల నుంచి సామర్థ్యం ఎక్కువ ఉన్న మిల్లులకు తరలించాలని జేసీ బి. రామారావు.. డీఎస్‌ఓ కె. నిర్మలాబాయిని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ఆధిపత్యం ఉన్నవారి మిల్లులకే ధాన్యం చేరాయి. ఈ మిల్లుల్లో ధాన్యం గుట్టలుగా పేరుకుపో యినా నిబంధనల మేరకు 67 శాతం బియ్యాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదు. దీంతో ఇటువంటి మిల్లులను గుర్తించారు. దాదాపు 15 మిల్లుల యజమానులు తమ సామర్థ్యానికి మించి ధాన్యం నిల్వలను ఉంచుకున్నారు. ఇటువంటి వారితో పాటు సామర్థ్యం ఉన్నా.. కొన్ని మిల్లుల్లో గింజ ధాన్యం లేకపోవడాన్ని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. వీటిని మాత్రం సరి చేస్తున్నట్టు గురువారం నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించిన నోట్ తయారు చేస్తున్నారు.
ముగిసిన తనిఖీలు
Published Fri, Jan 23 2015 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement