కావలిలో విజిలెన్స్‌ దాడులు | Vigilance attack On Kavali Fruits Markets | Sakshi
Sakshi News home page

కావలిలో విజిలెన్స్‌ దాడులు

Published Wed, May 16 2018 12:51 PM | Last Updated on Wed, May 16 2018 12:51 PM

Vigilance attack On Kavali Fruits Markets - Sakshi

రుద్రకోటలోని బాలాజీ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తున్న శ్రీకంఠనాథ్‌రెడ్డి

కావలిరూరల్‌: కావలిలో మంగళవారం రీజనల్‌ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.శ్రీకంఠనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో విజిలెన్స్‌ డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం మూడు టీములుగా పట్టణంలోని రెండు పండ్ల దుకాణాలు, రుద్రకోటలోని రైస్‌ మిల్లుపై దాడిచేశారు. కాగా మండలంలోని రుద్రకోటలో ఉన్న శ్రీబాలాజి రైస్‌మిల్లుపై మంగళవారం తెల్లవారుజామున విజిలెన్స్‌ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా ఉన్న 3,500 ఖాళీ బియ్యం బస్తాలను, రేషన్‌ షాపుల నుంచి సేకరించినట్లు భావిస్తున్న 100 బియ్యం బస్తాలను గుర్తించారు. అలాగే కృష్ణపట్నం పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిఖీల విషయమై మిల్లు యజమాని నారపరెడ్డి నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దాడుల సమాచారం తెలుసుకుని పరారైనట్లుగా భావిస్తున్నారు.

మామిడి పండ్ల దుకాణాలపై
పట్టణంలోని మేదరవీధిలో ఉన్న అడుసుమల్లి జయరామయ్య పండ్ల దుకాణం, ఐదులాంతర్ల సెంటర్‌లో ఉన్న పసుపులేటి హరిప్రసాద్‌ పండ్ల దుకాణాలపై మంగళవారం ఉదయం విజిలెన్స్‌ డీఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు ఉపయోగించే ఇథిలిన్‌ రిఫైనర్, క్రిపాన్, గ్రీన్‌ థ్రిల్‌ రసాయనాలను గుర్తించారు. వాటిని సీజ్‌ చేసి, మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐలు ఆంజనేయరెడ్డి, పి.వీరనారాయణ, విజిలెన్స్‌ సీఎస్డీటీ పద్మజ, డీసీటీఓ విష్ణు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎస్‌.రామచందర్, కె.సతీష్‌కుమార్, కావలి తహసీల్దార్‌ కార్యాలయం ఆర్‌ఐ ఎస్‌.విష్ణుకిరణ్, వీఆర్వోలు బాలకోటయ్య, రహంతుల్లా, నాగభూషణం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement