సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహాకుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకే బ్రోకర్లకు అమ్ముకునే పరిస్థితులు సృష్టించి లబ్ధి పొందేలా సీఎం కేసీఆర్ పథకం రచించారన్నారు. దీని వెనుక రూ. వందల కోట్లు ప్రభు త్వ పెద్దలకు కమీషన్లుగా ముట్టబోతున్నాయని, వడ్ల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఇందులో భాగమేనని చెప్పారు.
ఈ మేరకు శనివారం రైతులకు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘యాసంగి పం టను ఎట్లా అమ్ముకోవాలో తెలియక రైతులు బాధపడుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన సీఎం ఢిల్లీ వెళ్లి ధర్నాలు, ఆందోళనల పేరిట రాజకీయం చేసి సమస్యను జఠిలం చేయడం ఎంతవరకు కరెక్టు?’ అని ప్రశ్నించారు.
సర్కారు పెద్దలకు క్వింటాలుకు 100 కమీషన్!
‘యాసంగి పంట ద్వారా కోటి మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి జరిగింది. కేంద్రం క్వింటాలు వడ్లకు మద్దతు ధర రూ.1,960గా నిర్ణయించింది. కొందరు మిల్లర్లు క్వింటాలు వడ్లను రూ.1,300 నుండి రూ.1,660 లోపే కొంటున్నారు. ఎమ్మెస్పీ దక్కక రైతులు నష్టపోతున్నారు’అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కామ్‌లో ప్రభుత్వ పెద్దలకు ప్రతి క్వింటాలుకు రూ. వంద చొప్పున రూ. వందల కోట్ల కమీషన్ ఇచ్చేలా కొందరు రైస్ మిల్లర్ల మాఫియా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది’ అని సంజయ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment