చిత్తశుద్ధి ఉంటే ఆమరణ దీక్ష చేయాలి | Telangana: Revanth Reddy Challenges CM KCR Over Paddy Procurement | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి ఉంటే ఆమరణ దీక్ష చేయాలి

Published Thu, Mar 31 2022 3:26 AM | Last Updated on Thu, Mar 31 2022 5:16 AM

Telangana: Revanth Reddy Challenges CM KCR Over Paddy Procurement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం కొనుగోలు చేసే వరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ క్షేత్రంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు రాష్ట్ర రైతులను కేసీఆర్‌ పణంగా పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ దిగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రూ.10 వేల కోట్లిస్తే 45 రోజుల్లో తెలంగాణలో యాసంగి ధాన్యం ఎలా సేకరిస్తామో చేసి చూపిస్తామన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొడుకు నుంచి తప్పించుకొనేందుకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వస్తున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం... 
‘ఏప్రిల్‌ మొదటివారం నుంచి వరి కొనుగోలు చేయకుండా నాటకాలు ఆడితే కేసీఆర్, కేటీఆర్‌ను నడి బజారులో ఉరివేసే బాధ్యత రైతుల పక్షాన కాంగ్రెస్‌ తీసుకుంటుంది. ప్రగతిభవన్‌లు, పోలీస్‌ పహారాలు మిమ్మల్ని కాపాడుతాయని అనుకుంటున్నారేమో, ఏవీ కాపాడవు. నిజాం కూడా ఇలాగే అనుకున్నడు. ఆయనను కోట గోడలు కాపాడలేదు.. రజాకార్ల సైన్యం కాపాడలేదు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ రైతులకు కేసీఆర్‌ మెడలు వంచడం తెలుసు. దీనికి ఎలా నాయకత్వం వహించాలో కాంగ్రెస్‌కు తెలుసు’అని రేవంత్‌ ధ్వజమెత్తారు.  

రైతులను దివాలా తీయించారు... 
‘ఎఫ్‌సీఐకు బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేసీఆర్‌ గతేడాది సంతకం పెట్టి ప్రధానికి లొంగిపోయి ఇప్పుడు రాజకీయ లాభం కోసం డ్రామాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు మందుమీద మాత్రమే చూపు ఉంది.. ముందుచూపు లేదు. రాష్ట్రంలో పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలను కావాలనే దూరం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల కుట్రలతో రైతులను దివాళా తీయించారు.

రైతులను ఆదుకొనేందుకు కాంగ్రెస్‌ ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్రం కొంటలేదు కాబట్టి వరి వద్దంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నది ఎందుకు దళారి పని చేయడానికా’అని రేవంత్‌ ప్రశ్నించారు. అందరిని వద్దని కేసీఆర్‌ మాత్రం తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ ధాన్యం కొనేవాళ్లు.. పేదల వడ్లు కొనరా అని ఆయన ప్రశ్నించారు.  

శ్రీమంతులుగా ఎలా మారారో ప్రజలకు చెప్పాలి
‘దోపిడీదారుడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ కేసీఆర్‌కు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం ఆగర్భ శ్రీమంతులుగా మారింది. నిజాం వారసుల కంటే కేసీఆర్‌ వారసుల వద్దే ఎక్కువ సంపద ఉంది. ఈ 8 ఏళ్లలో ఎలా శ్రీమంతులుగా మారారన్నది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ చరిత్ర, దేశ చరిత్ర, తెలంగాణ ప్రజల గురించి కేటీఆర్‌కు అవగాహన లేదు’అని రేవంత్‌ ఆరోపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement