సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వచ్చే యాసంగి (రబీ) సీజన్‌లో వరిసాగు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకముందు బాయిల్డ్ రైస్ (ఉప్పు డు బియ్యం) ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే ప్రసక్తి లేదని మరోమారు తేల్చిచెప్పింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్రానికి సూచించింది. ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యాన్ని ప్రకటించాలని, ప్రస్తుత వానాకాలంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్లను పక్కనపెట్టింది.
కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ కమిటీని నియమిం చనున్నారని.. పంట కొనుగోళ్లు, మార్పిడి, కనీస మద్దతు ధరలపై ఆ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కోటి టన్నులు సేకరించాలి..
తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై నాలుగు రోజుల కింద మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఎలాంటి స్పష్టతరాకపోవడంతో.. వ్యవసాయ అధికారులతో చర్చించి 26వ తేదీన ధాన్యం కొనుగోళ్లపై తమ విధానాన్ని స్పష్టం చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు.. మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంట్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు పీయూష్ గోయల్‌తో గంట పాటు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు, యాసంగిలో వరిసాగు పరిస్థితిని కేంద్రమంత్రికి నివేదించారు. తెలంగాణ నుంచి ఏటా 1.50 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. ప్రస్తుత (వానాకాలం) సీజన్‌లో కేంద్రం 60లక్షల టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) సేకరిస్తామని చెప్పిందని.. కనీసం కోటి టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. అంత స్థాయిలో ధాన్యం సేకరించలేమని తేల్చిచెప్పారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో 10 లక్షల టన్నుల వరకు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కానీ హామీ ఇవ్వలేదు.
వరిసాగును పక్కనపెట్టండి
యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునే పరిస్థితులు లేనందున వరిసాగును పూర్తిగా పక్కనబెట్టి.. పప్పుదినుసులు, నూనె గింజల సాగు, పంట మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ సూచించారు. ఇప్పటికిప్పుడు వరి నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడం సాధ్యం కాదని రాష్ట్ర మంత్రులు వాదించినా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది.
ఇక వార్షిక కొనుగోలు లక్ష్యాన్ని ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ స్పష్టం చేశారని పేర్కొన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పంటల పరిస్థితి ఆధారంగా కొనుగోళ్లపై నిర్ణయం ఉంటుందని.. వ్యవసాయశాఖ, ఆహారశాఖ సహా పలు శాఖలు కలిసి దీనిపై అంచనాలు రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పిన సమాధానాలపై మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినా.. అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది.
యాసంగిలో వరి వద్దన్నారు..
కేంద్రమంత్రితో భేటీ అనంతరం రాష్ట్ర ప్రతినిధులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీరు పూర్తి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసం చర్చలకు వచ్చాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. వార్షిక ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ప్రకటించాలని కోరినా.. ముందుగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం పోటెత్తుతోంది. ఇప్పుడైనా ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని కోరాం. కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. గత ఏడాది మాదిరే సేకరిస్తామంటూ దాటవేశారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రితో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని, అందుకు అనుగుణంగా సీఎం రైతులకు దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వరి సాగు చేయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ రకంగా మాట్లాడొద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పామని, ఇక ముందు అలా ప్రకటనలు చేయబోరని కేంద్రమంత్రి వివరించారని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. కేంద్రం తీరు బాధాకరం. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. కేంద్ర అధికారులు యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని అంటున్నారు కాబట్టి వరి వేయొద్దని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరినా స్పందించలేదు. – మంత్రి నిరంజన్‌రెడ్డి
మేము నేరుగా వరి వద్దని
చెప్పలేదు. యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం కొనలేని పరిస్థితుల్లో పంటల మార్పిడికి వెళ్లాలని సూచించాం. ప్రస్తుత వానాకాలంలో నిర్ణయించిన టార్గెట్‌ను పూర్తి చేయడంపై మొదట దృష్టి సారించాలని రాష్ట్ర ప్రతినిధులకు స్పష్టం చేశాము. – కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment