మీడియాతో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పక్కన బాల్క సుమన్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణకు బీజేపీ నేతలు సహకరించకపోగా, అడుగడుగునా మోకాలడ్డుతున్నారని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడై తెలంగాణకు, రైతులకు శాపంగా మారారన్నారు. ఉప్పుడు బియ్యం సమస్య తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఉందని ఆ రాష్ట్రాల ఎంపీలు చెబుతుంటే రేవంత్ సిగ్గు లేకుండా తెలంగాణలోనే సమస్య ఎందుకుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైద్య సీట్ల భర్తీపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వైద్య విద్య ప్రవేశాల్లో అక్రమాలపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ..బీజేపీ లేకపోతే టీఆర్‌ఎస్‌కు పదవులు ఎక్కడివని బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 1997 నాటి కాకినాడ తీర్మానానికి అనుగుణంగా 2000 సంవత్సరంలోనే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment