వానాకాలం బియ్యం యాడబొయ్యాలె? | Telangana: TRS Corners Centre Over Paddy Procurement Issue Warehouses Are Fully Filled | Sakshi
Sakshi News home page

వానాకాలం బియ్యం యాడబొయ్యాలె?

Published Wed, Apr 6 2022 3:19 AM | Last Updated on Wed, Apr 6 2022 3:23 PM

Telangana: TRS Corners Centre Over Paddy Procurement Issue Warehouses Are Fully Filled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం, రాష్ట్రం మధ్య మొదలైన ధాన్యం, బియ్యం రగడకు ఇప్పట్లో తెరపడేలా లేదు. వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధులంతా ధర్నాకు సిద్ధమయ్యారు. వచ్చే వారంలో యాసంగి కోతలు మొదలవనుండగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు గోదాముల్లోని బియ్యం మూవ్‌మెంట్‌ లేక మగ్గిపోతుండగా 2020–21 వానాకాలం సీజన్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ని ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జూలైలోగా వానాకాలం ధాన్యానికి సంబంధించి 47 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని (సీఎంఆర్‌) రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అప్పగించాలి.

కానీ ఇప్పటివరకు 15.37 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చింది. మిగతా 31.68 ఎల్‌ఎంటీ బియ్యాన్ని తరలించేందుకు గోదాములు కూడా ఖాళీ లేవు. గడువు ముగిసిందనే నెపంతో 2020–21 యాసంగి సీఎంఆర్‌ 9 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెగేసి చెప్పింది. ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. తాజాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న కయ్యం నేపథ్యంలో మరోసారి వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌పై వివాదం రేకెత్తే పరిస్థితి కనిపిస్తోంది.  

గోదాముల్లో జాగా లేదు... 
రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాములు, ప్రైవేటు గోదాములు 72 ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి సామర్థ్యం 20.05 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఈ గోదాములన్నీ ప్రస్తుతం 2020–21 యాసంగి, వానాకాలం బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు తరలించే బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అక్కడి అవసరాలకు అనుగుణంగా తీసుకెళ్తుండటం, రైల్వే రేక్‌లను సమయానుకూలంగా సమకూర్చకపోవడంతో గోదాముల్లోని బియ్యంలో లక్క పురుగులు, ఎలుకలు, పందికొక్కులు చేరి పొక్కిలి చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం గోదాముల్లో... ధాన్యం నిల్వలన్నీ మిల్లుల్లో మగ్గే పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే బియ్యాన్ని తరలించేందుకు గోదాములు ఖాళీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిన సొమ్ము రీయింబర్స్‌మెంట్‌ కింద తిరిగి రాక ఆందోళన చెందుతోంది. 

ఉత్పత్తి, నిల్వకు మధ్య భారీ తేడా... 
2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 92.34 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఇందులో 67 శాతం బియ్యాన్ని (62.53 లక్షల మెట్రిక్‌ టన్నులు) ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. కానీ మార్చి 31 నాటికి 53.38 లక్షల మెట్రిక్‌ టన్నులే సరఫరా చేసింది. ఇంకా 9.15 ఎల్‌ఎంటీ బియ్యాన్ని ఇవ్వడానికి మే 31 వరకు రాష్ట్రం గడువు కోరినా కేంద్రం ససేమిరా అన్నది.

ఇక వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ కింద 47 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 15.37 ఎల్‌ఎంటీ మాత్రమే ఇచ్చింది. మిగతా 31.68 ఎల్‌ఎంటీ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడమొక్కటే పరిష్కారం. అయితే ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడాన్నిబట్టి కొత్తగా బియ్యం నిల్వలను నింపల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా ఎఫ్‌సీఐ గోదాములను సమకూర్చుకోకపోవడంతోపాటు గోడౌన్‌లలోని నిల్వలను ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడం సమస్యకు కారణంగా అధికారులు చెబుతున్నారు.

గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడంతో మిల్లుల నుంచి కొత్తగా సీఎంఆర్‌ సరఫరా చేసే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ వాదిస్తోంది. అయితే గత యాసంగి తాలూకు బియ్యం 9.15 ఎల్‌ఎంటీని కేంద్రం తీసుకోకపోయినా మిల్లింగ్‌ చేసి రాష్ట్ర అవసరాలకు నిల్వ చేయాల్సిందే. అలాగే వానాకాలం సీజన్‌ బియ్యం 31.68 ఎల్‌ఎంటీ బియ్యం కలిపితే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలకు అనుగుణంగా జూలై నాటికి గోదాములు సిద్ధంగా ఉంటాయా అనేది ప్రశ్న. 

20.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తరలించాం: ఎఫ్‌సీఐ 
డిసెంబర్‌ 2021 నుంచి ఈ మార్చి వరకు రాష్ట్రంలోని గోదాముల నుంచి 20.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తరలించినట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. 2020–21 యాసంగి సీఎంఆర్‌ డెలివరీకి సెప్టెంబర్‌ 2021తో గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐదుసార్లు గడువు పొడిగించామని, వానాకాలం సీజన్‌ బియ్యం కోసం జూలై వరకు మాత్రమే గడువు ఉందని ఆయన తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement