సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమానపరచడమే. రాష్ట్ర నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోంది. కేంద్రం వద్ద అడుక్కునేందుకు మేం బిచ్చగాళ్లం కాదు’అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తమ మంత్రులను అవమానించి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి శుక్రవారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్‌ఎస్ ఎంపీలు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారు. రైతుల కోసం కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఆ పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారు. రైతుల సమస్యల కన్నా తమ పార్టీ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయి. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళ్తారు. మేం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తాం’అన్నారు.
రైతుల కోసం ప్రతిపక్షాలు కలిసి రావట్లేదు
‘రాష్ట్ర మంత్రులు హైదరాబాద్ వచ్చినంత మాత్రాన వెనకడుగు వేసినట్లు కాదు. రైతుల కోసం అన్ని పార్టీలూ ఏకమైన సందర్భాలు అనేకం ఉన్నా రాష్ట్రంలో ప్రతిపక్షాలు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. యాసంగిలో వరి సాగుపై స్పష్టత ఇవ్వకుండా కేసీఆర్ మీద కోపం, అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పి న్యాయం చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై అసెంబ్లీ తీర్మానం చేసినా న్యాయం జరగట్లేదు. బీజేపీ కుట్రలను ఛేదించడంలో మాకు ప్రత్యేక వ్యూహం ఉంది’అని మంత్రి అన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్, కౌశిక్‌రెడ్డి తదితరులు
Comments
Please login to add a commentAdd a comment