సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు కోట్లకు పైగా తెలంగాణ ప్రజల్ని, లక్షలాది తెలంగాణా రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కించపరిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు భిక్షగాళ్లు కాదని, పంటలు అమ్ముకోవడమనే తమ హక్కును సాధించుకుని తీరతామని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజకీయ సమావేశం నిర్వహించిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్రమంత్రి కేవలం బీజేపీ ప్రతినిధి కాదని, గోయల్ దేశంలోని ప్రజలందరికీ ప్రతినిధిలా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రులు, ఎంపీలు, అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం వస్తే వారికి పనిలేదా అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తున్న వారికి కిషన్‌రెడ్డి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.
రాతపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే..
ధాన్యం సేకరణ విషయంలో లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సమానమైన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని కేంద్రం గతంలో లేఖ ఇవ్వడం అన్యాయమని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో మిగిలే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంగతేంటని ప్రశ్నించారు. వర్షాకాలంలో వచ్చే ముడి బియ్యం ఎంతైనా కొంటామంటున్న కేంద్ర మంత్రులు, దాని ప్రకారం రాతపూర్వక హామీ ఇవ్వమని అడిగితే వారికి ఉన్న సమస్య ఏంటని నిలదీశారు.
గత రబీకి సంబంధించి తీసుకొంటామని నోటిమాటగా చెప్పిన దానిలో ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం తీసుకోవట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై తమకు ఉన్న అనుమానాలతోనే లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తాము పట్టుబడుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 6,857 కేంద్రాలకు గానూ 2,760 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగతా వాటిలో సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని గంగుల తెలిపారు.
కేంద్రానికి పట్టవు: జగదీశ్ రెడ్డి
కేంద్రానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు అవసరం లేదని విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రైతుల మేలు కోసం ఎవరు పని చేస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. ధాన్యం సేకరణ అంశంలో బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమని, సీఎం కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం బీజేపీ నాయకులకు ఏమ్రాతం సాధ్యం కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment