
రాష్ట్ర విత్తన–సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ భవనానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట: గత కేంద్ర ప్రభుత్వాల మాదిరే.. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా వడ్లను కొనుగోలు చేయాలని, నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్, 70 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్తే.. పని లేదా అంటూ హేళన చేయడం సరికాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో విత్తన ధ్రువీకరణ సంస్థ నూతన భవనం, గోదాములకు శంకుస్థాపన, దుబ్బాకలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని, సంవత్సర కాలం రైతుల పోరాటంతో వ్యవసాయంపై నల్ల చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. కాగా, విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలమని, రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సీడ్ కార్పొరేషన్‌కు కార్యా లయాలు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేటతో కలిపి ఆరుకు చేరాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కుంటుపడిన ఆస్పత్రులను ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వివరించారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం ఉందని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి వస్తే కరోనా మూడో డోస్ టీకా వేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తెలంగాణలో మొదటిసారిగా సిద్ది పేట సమీకృత మార్కెట్‌కు తొలి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.