బోనకల్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పాలకులు ప్రకటించాలని, లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో మరోసారి రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయడం చేతకాదని చేతులెత్తేసిన బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఇప్పుడు ధర్నాలు చేయడం గర్హనీయమని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు. కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షతతో జాతి సమైక్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలే కరువయ్యాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment