ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరి ధాన్యం విషయంలో గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. తొలుత ‘వరి వేస్తే ఉరే గతి’ అన్నారు... ఆమధ్య యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదన్నరు. ఇప్పుడు మాట మార్చి కేంద్రమే రాష్ట్రంలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాలని పేచీ పెడుతున్నారు.
ధాన్యం కొనుగోలు చేసి మర ఆడించి, బియ్యంగా మార్చి వాటిని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకూ జరిగిందదే. ఇందుకయ్యే ఖర్చు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోంది. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో కనీస మద్దతు ధరను కేంద్రమే చెల్లిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమిటి? కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ... కేసీఆర్ కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం అధీనంలో తగిన యంత్రాంగం లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్రాలకు అప్పగించింది. ఈ విషయం చెబితే పంజాబ్‌లో కొంటున్నప్పుడు ఇక్కడెందుకు కొనడం లేదని కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు.
పంజాబ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ కమిటీలే స్వయంగా రైతుల నుండి వడ్లను కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసి వడ్లను కేంద్రానికి అప్పగిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ మార్కెట్ కమిటీలు తూతూ మంత్రంగా పనిచేస్తున్నయ్.. వాటికి ధాన్యం సేకరించే బాధ్యతను అప్పగిస్తే సేకరించే స్థాయి ఉందా?
ఇక్కడ మరో విషయం చెప్పాలి... 2021–22 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతేడాది ఒప్పందం జరిగింది. ఈ రెండింటికి నడుమ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. మరి ఒప్పందాన్ని తానే ఉల్లంఘంచి... ఆ ఒప్పందం నుండి తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్?
ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని గత అక్టోబర్ 4న కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాసింది. మెడమీద కత్తి పెట్టిందనే అభియోగంతో ఇప్పుడు మాట తప్పుతున్నారు. గతంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాల ప్రజలు బాయిల్డ్ రైస్ తినేవారు. ఇప్పుడు దాన్ని తినడం తగ్గించేశారు. ఆయా రాష్ట్రాలే అక్కడి అవసరాల మేర ఆ రైస్‌ను తయారు చేసుకుంటున్నాయి. అందుకే కేంద్రం ఆ బియ్యం వద్దంటున్నది.
మనకంటే ఎక్కువ వరి పండించే రాష్ట్రాలు ఉన్నా అక్కడ కొనుగోళ్ల సమస్య రావడంలేదు. మన పొరుగు రాష్ట్రం ఏపీ మనకంటే ఎక్కువ వరి పండిస్తోంది. అక్కడ కేంద్రంతో ఏ గొడవా లేదు. మిల్లర్ల ప్రమేయం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి నేరుగా కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటోంది. కొన్న ధాన్యంలో... రేషన్ సరఫరాకు అవసరమైన ధాన్యాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని కేంద్రానికి అమ్ముతోంది. కానీ కేసీఆర్ చేస్తోందేమిటి? వానా కాలం పంట వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు.
అసలు తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం ఎంత? ఈ ప్రభుత్వం చూపుతోంది ఎంత? వాస్తవాలు తేల్చడానికి తక్షణమే కేంద్ర బృందం రాష్ట్రాన్ని సందర్శించాలని మేం అడగబోతున్నం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ తరపున మేం చెబుతున్నం... కేసీఆర్‌కు ‘వరి అంటే ఉరి’.. కానీ మా దృష్టిలో ‘వరి అంటే సిరి’! మేం అధికారంలోకి వస్తే వానాకాలంతోపాటు యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొని చూపిస్తం. అవసరమైతే రైతు కోసం రాష్ట్రం తరఫున కొంత బోనస్ లేదా సబ్సిడీ కూడా ఇస్తాం. (క్లిక్: సంఘటితమైతేనే రాజ్యాధికారం)
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణలోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. పోయిన యాసంగి, అంతకుముందు నిల్వ చేసిన బియ్యాన్ని కూడా మిల్లర్లు వానా కాలం పంటగా చూపుతూ ఎఫ్‌సీఐకి పెడుతున్నరు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో చౌకగా కొన్న ధాన్యాన్నీ ఇక్కడిదేనని లెక్కలు చెబుతున్నరు. కేంద్రానికి మిల్లర్ల వ్యవహారం అంతా అర్థమైంది. కొన్ని చోట్ల తనిఖీలు చేసి పట్టుకుంది. ఇదే విషయం చెబుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇకపై అట్లా జరగకుండా చూస్తామని బదులిచ్చి, ఇప్పుడు మళ్లీ కొత్త వాదనలకు తెర లేపారు. అందుకే కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో యాసిడ్ టెస్ట్‌కు సిద్ధమైంది. ఎఫ్‌సీఐ సేకరించే ధాన్యంపై యాసిడ్ టెస్ట్ చేస్తే ఏ సీజన్లో పండించారో తేలిపోతుంది. అంతేగాదు.. ఆ పంట తెలంగాణకు సంబంధించిందా? ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చారా అనేది కూడా తెలిసి పోతుంది. ఈ విషయాలు బయటపడతాయనే కేసీఆర్, మిల్లర్లు కుమ్మక్కై సమస్యను దారి మళ్లిస్తుండ్రు. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?)
యాసంగిలో పండించే ఏ వెరైటీ ధాన్యమైనా మిల్లింగ్ చేస్తే సగానికిపైగా నూక వస్తుందనే సీఎం మాటలు పచ్చి అబద్దం. యాసంగిలో సన్న వడ్లు మిల్లింగ్ చేస్తేనే నూక ఎక్కువొస్తది. సన్నవడ్లు పట్టిస్తే క్వింటాల్‌కు అదనంగా 10 కిలోల నూక వస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. అయినా నష్టమేముంది? నూకతో రైస్‌బ్రాన్ ఆయిల్ తయారు చేస్తున్నరు. రాష్ట్రంలో రైస్‌బ్రాన్ ఆయిల్ సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రంతో చేసుకున్న ఒప్పందంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ సంస్థలను నెలకొల్పిన దాఖలాల్లేవు. నూక వల్ల యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు మించి భారం పడే అవకాశమే లేదు. రైతు బంధు ద్వారా రూ. 13 వేల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే సీఎం రైతు సంక్షేమం కోసం రూ. 1,000 కోట్లు భరించలేరా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి.
- బండి సంజయ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment