
మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నా టీఆర్‌ఎస్ నేతలకు పట్టడంలేదని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలవకుండానే వచ్చారని, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి గోయల్ గడ్డి పెట్టి పంపించారని, వరంగల్ గోదాములోని 25 వేల...
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వానాకాలం వడ్లు ఎంత కొంటుందో తేల్చడంతోపాటు యాసంగి ధాన్యాన్ని కూడా కొంటామని స్పష్టం చేసే వరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెనక్కు రావద్దని.. అక్కడే ఆమరణ దీక్ష చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రులు ఏమీ తేల్చకుండా ఢిల్లీ నుంచి వస్తే గాజులు, చీరలు పంపుతామన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివా సంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి టీఆర్‌ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని విమర్శించారు.
మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నా టీఆర్‌ఎస్ నేతలకు పట్టడంలేదని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలవకుండానే వచ్చారని, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి గోయల్ గడ్డి పెట్టి పంపించారని, వరంగల్ గోదాములోని 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్‌మాల్‌పై నిలదీస్తే దొంగల్లా పారిపోయి వచ్చా రని ఆరోపించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఫొటోలు దిగి అక్కడ ఆందోళన చేసినట్టు ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు మంత్రులు ఢిల్లీ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.
నిరసనల్లో కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదేం?
బీజేపీపై మోగించిన చావు డప్పు నిరసనల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్ ఎందుకు పాల్గొనలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న మంత్రులు, ఎంపీల బృందంలో కేటీఆర్, సంతోశ్‌లు ఎందుకు లేరని, గత ఆరు రోజులుగా వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో ఇస్తామన్న పంటనే ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రం చెబుతోందని, రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోయిందో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంత సరఫరా చేయగలరో చెప్పకుండా అదనంగా ఎంత కొంటారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాలన్నింటినీ వివరించేందుకు ఈ నెల 27న ఎర్రవెల్లిలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అక్కడకు రైతులంతా తరలిరావాలని రేవంత్ కోరారు. రైతుల సమక్షంలోనే టీఆర్‌ఎస్, బీజేపీల నాటకాలను వివరిస్తామని చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ తెలిపారు.