శనివారం వరిదీక్షలో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నాల తదితరులు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కల్లాలపైనే గుండెలు ఆగిపోయి రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బువ్వ ఎలా సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవ త్వం ఉందా అని నిలదీశారు. ధనిక రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద రెండు రోజుల ‘వరి దీక్ష’ప్రారంభమైంది.
టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎస్. అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేతలతోపాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. అలాగే ప్రధాని, సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరి కొనకపోతే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ చౌరస్తాలో ఉరి తీయాలని వ్యాఖ్యానించారు.
ప్రధాని అపాయింట్‌మెంట్‌నే కేసీఆర్ అడగలేదు...
వరి కొనుగోలుపై ప్రధాని మోదీతో తాడోపేడో తేల్చుకొస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా అడగలేదని, ఎంపీ సురేశ్‌రెడ్డి ఇంట్లో విందు ఆరగించి వచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ మంత్రులు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను కలిసినప్పుడు కూడా యాసంగి గురించి అడిగారే తప్ప వానాకాలం సీజన్‌లో వచ్చిన ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. వరి పంట గురించి తెలంగాణ బీజేపీ నేతలు ఇకపై మాట్లాడబోరని గోయల్ స్పష్టం చేయడం టీఆర్‌ఎస్, బీజేపీలు తోడుదొంగలనడానికి నిదర్శనమన్నారు.
రైతుల మరణాలకు కేసీఆరే కారణం...
కాంగ్రెస్ పార్టీ నేతలకు రూ. 10 వేల కోట్లు ఇస్తే వానాకాలంలో తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామని, విదేశాలకు ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు. క్వింటాల్‌కు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా రూ. 500 బోనస్ కూడా చెల్లిస్తామన్నారు. అలా చేయకపోతే తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని, ఈ సవాల్‌కు సీఎం కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 8 లక్షల టన్నుల ధాన్యమే కొన్నారని విమర్శించారు. రైతుల మరణాలకు కేసీఆర్ కారణమని, ధాన్యం కొనేలా ప్రభుత్వ మెడలు వంచే వరకు విశ్రమించబోమన్నారు.
ప్రధాని ఆఫీసు ముందు ధర్నా చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొ న్నారు. తాము కేసీఆర్‌లాగా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోబోమని, పార్లమెంటులో గళం వినిపిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.
వైఎస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు...
రైతులకు ఉచిత కరెంటు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఎద్దేవా చేస్తే వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టాక ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు గతి ఏమైందో అందరూ చూస్తున్నారని, రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులన్నారు.
తెలంగాణ వరి రైతులను నట్టేట ముంచింది కేసీఆరేనని నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌లో వచ్చే 60 లక్షల టన్నుల్లో ఇప్పటివరకు రాష్ట్రం సేకరించింది 8 లక్షల టన్నులేనన్నారు. రాష్ట్రంలో 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమైతే 5 కోట్ల బ్యాగులే కొన్నారని విమర్శించారు.
కోమటిరెడ్డి, రేవంత్ ముచ్చట్లు...
వరి దీక్షా వేదికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఆయనతో కలిసి తొలిసారి వేదికను పంచుకున్న కోమటిరెడ్డికి వీహెచ్‌తోపాటు రైతు సంఘాల నేతలు స్వాగతం పలికారు. వేదికపైకి కోమటిరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన రేవంత్... ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత ఉత్తమ్, వీహెచ్ సహా ఇతర నేతలంతా సరదాగా మాట్లాడుకోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
కాగా, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వరి దీక్షావేదికపైనే శనివారం రాత్రి నిద్రించారు. వీరితోపాటు అన్వేశ్‌రెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, భువనగిరి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment