సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తామర పురుగుతో నష్టపోయి మిర్చి రైతులు, ధాన్యం కొనుగోళ్లు లేక వరి రైతుల చావు కేకలు వినిపించడం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి కేవలం ఐదు క్వింటాళ్లు రావడమే గగనంగా మారిందని, లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి మిర్చి పండించిన రైతులు దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక్కో మిర్చి రైతు నెత్తిన ఐదు నుంచి రూ.10 లక్షల అప్పు ఉందని, ఏ పత్రిక తిరగేసినా మిర్చి రైతుల ఆత్మహత్యలే దర్శనమిస్తున్నాయని వెల్లడించారు.
పంట మార్పిడికి భరోసా ఏదీ?
వరి వద్దు ...పంటల మార్పిడి చేయాలంటోన్న మీరు మిర్చి రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని రేవంత్ లేఖలో డిమాండ్ చేశారు. ఏడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మెజారిటీ రైతులకు పరిహారం కూడా అందలేదని, పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల్లో భరోసా నింపేలాచర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని, తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటుగా రూ.లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. లేదంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment