యాసంగి ధాన్యం కొనుగోలు అంశం దేశ రాజధాని హస్తినలో వేడిని పెంచుతోంది. మూడు పార్టీలకు చెందిన నేతల మోహరింపుతో రాష్ట్ర రాజకీయాలకు ప్రస్తుతం ఢిల్లీ వేదికగా మారింది. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనేలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత ఢిల్లీలో లడాయి షురూ అవుతుందని, ఈలోగా కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు కలుస్తారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలువురు రాష్ట్ర మంత్రులు మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాడోపేడో తేల్చుకునే తిరిగి వస్తామని వారు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ధాన్యంపై రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు మీరడంతో మతి తప్పి మాట్లాడుతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం వేడిని మరింత పెంచింది. మరోవైపు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి.. టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే తానులో ముక్కలేనని, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయంటూ వ్యాఖ్యానించడంతో.. ‘ధాన్యం రాజకీయం’ రసకందాయంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment